మూడో కన్నా..! ఏది ఒక్కసారి తెరువు చూద్దాం..!

మూడో కన్నా..! ఏది ఒక్కసారి తెరువు చూద్దాం..!

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... మహాకూటమి అభ్యర్థి సీతక్క తరపున ములుగులో ప్రచారం నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా ములుగు సభలో మాట్లాడుతూ... తెలంగాణలో ఖేడి పాలన సాగుతోందని మండిపడ్డారు. మందుపోసుకొని వచ్చి మాట్లాడే కేసీఆర్... చంద్రబాబుపై మూడో కన్ను తెరుస్తాడట..! ఏది ఒక్కసారి తెరువు చూద్దాం..! అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యేక కనీసం తెలంగాణ వచ్చినా... సమ్మక్క సారక్క జాతరకే రాలేదు... తెలంగాణ వస్తే మొక్కు చెల్లిస్తానన్న కేసీఆర్ ఎందుకు జాతరకు రాలేదని ప్రశ్నించారు రేవంత్. మరోవైపు మందు కొట్టి సైకిల్ మోటారు నడిపినోడిని కేసులు పెట్టి జైల్ కి పంపుతుంటే... తాగి రాష్ట్రాన్ని నడుపుతుంటే ఎలా ఎలా భరించాలి... అలాంటి వాళ్లను అండమాన్ జైల్ లో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. 

కేసీఆర్ కి మరోసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తే దోచుకోకుండా ఉంటాడా...? ఆలోచించాలన్న రేవంత్ రెడ్డి... తెలంగాణను ఎవరి చేతులో పెడితే బాగుంటుందో ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. రైతులు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా అప్పులు కట్టకండి రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్... కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఉడగొట్టండి... 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో నీతికి, అవినీతి మధ్య పోరాటం జరుగుతోందని...  గెలిపించుకునే బాధ్యత  మనపై ఉందన్నారు. పోడు భూముల వివాదం సీతక్క ద్వారానే పరిష్కారం కాబోతున్నాయన్నారు. జిల్లా సమస్యలు కావొచ్చు... గుత్తికోయల సమస్యలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిన వాళ్లు... ఎన్ని నీళ్లు తెచ్చారు..? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? లెక్క చెప్పండి అని డిమాండ్ చేశారు.