నా ర్యాలీకి ఎందుకు అనుమతివ్వరు..?

నా ర్యాలీకి ఎందుకు అనుమతివ్వరు..?

తెలంగాణలో కేసీఆర్ ప్రైవేటు సైన్యం నడుస్తున్నదని.. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి బుద్ధప్రకాష్‌ను ఇవాళ కలిసిన రేవంత్‌.. 19న కొడంగల్‌లో తాను నామినేషన్ వేయనున్న సందర్భంగా ర్యాలీకి అనుమతివ్వాలని, బందోబస్తు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'రాష్ట్రంలో అందరికీ అనుమతి ఇచ్చి నాకెందుకు ఇవ్వడం లేదు? టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్ కూడా వేశారు. ర్యాలీ కూడా చేశారు' అని అన్నారు. 'ప్రగతి భవన్‌లో పార్టీ కార్యక్రమాల పై అనేక సార్లు ఫిర్యాదు చేశాను. నిన్న కేసీఆర్ అరవింద్ రెడ్డికి కండువా కప్పితే.. కేటీఆర్ దానంకి బీఫారం ఇచ్చారు. ప్రగతి భవన్‌ను టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మర్చారు. వీరిద్దరికీ ఎన్నికల నిబంధనలు వర్తించవా..?' అని రేవంత్‌ ప్రశ్నించారు. అధికారులు కేసీఆర్‌ ఒత్తిడికి లొంగుతున్నారా లేక ఇంకేమైనా ఇబ్బందులున్నాయా అని ఆయన నిలదీశారు.