తెలకపల్లి రవి : భగత్‌సింగ్‌  అంటేనే ఇంక్విలాబ్‌

తెలకపల్లి రవి : భగత్‌సింగ్‌  అంటేనే ఇంక్విలాబ్‌

తమ కాలం కంటే ముందుండే వాళ్ళను దార్శనికులంటాం. సవాళ్లు, సమరాల్లో ముందుండేవాళ్ళను సాహసికులంటాం . ధన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించగలిగిన వాళ్ళను త్యాగులంటాం. చేయవసిందేమిటో, ఎందుకో స్పష్టంగా చెప్పగలిగే వాళ్ళను సిద్ధాంతకారులంటాం. ఇందులో ప్రతి నిర్వచనమూ భగత్‌సింగ్‌కు వర్తిస్తుంది. భగత్‌సింగ్‌ అంటే శాండర్స్‌ (స్కాట్‌) హత్య, పార్లమెంటులో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబమెక్కడం గుర్తుకురావచ్చు. నిజానికి నెత్తిమీద టోపీతో మన మనసులో స్థిరపడిన భగత్‌సింగ్‌ ఇమేజ్‌ కన్నా ఆయన ఉజ్వల జీవితం ఎన్నో రెట్లు విశిష్టమైంది. విప్లవాత్మకమైంది. ఆయన సమరశీల జీవితం, సమగ్ర అవగాహన, సమంయమనం నిండిన ఆచరణ ఆ కాలానికి సాధ్యమైనవి. ఇప్పటికీ వర్తించేవి. ప్రత్యేకించి యువతకు అవి మార్గదర్శకాలు. ఉత్ప్రేరకాలు. పాతికేళ్లు రాకుండానే ఉరికంబమెక్కిన‌ యువ కిశోరం గనక ఆయన యువతకు మార్గదర్శకుడైనాడన్నది చాలా పరిమితమైన అవగాహన. యువత ఎలా వుండాలి, తమ జీవితాలు ఎలా ఉంచుకోవాలి, దేశంకోసం ప్రజ కోసం ఎలా పనిచేయాలన్న దానిపై ఆయన అధ్యయనం ఆచరణ ఆదర్శప్రాయంగా వుండటం అందుకు కారణమవుతుంది. దేశంలో ఏకపక్ష పోకడలు, మతతత్వాలు, స్థార్థపూరిత రాజకీయాలు చేస్తున్న ఈ రోజున త్యాగం సాహసం భావ స్పష్టత నిండిన భగత్‌ సింగ్‌ బాట ప్రత్యేకించి చెప్పుకోదగింది.వందేమాతరం,  సత్యాగ్రహం వంటి మాటలే వినిపిస్తున్న రోజున ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని నిప్పు కక్కుతూ నినదించిన వాడు ఆయన.  కోర్టు విచారణకు హాజరైనప్రతిసారి భగత్‌ సింగ్‌ బృందం అదేనినాదమిస్తూ ప్రవేశించేది. విప్లవం వర్ధిల్లాలి అన్న ఆ మాటలు ఒక బ్రిటిష్‌ న్యాయమూర్తికి మింగుడు పడలేదు.  ఎప్పుడూ ఎందుకు ఆ నినాదం ఇవ్వడం అని ఆయన ప్రశ్నిస్తే ఆ భావన జనంలోకి తీసుకువెళ్లడానికి అని సూటిగా జవాబిచ్చాడు. ఎందుకంటే ఆయనకు   దేశ స్వాతంత్య్రం బ్రిటిష్‌వారి నిష్క్రమణతో  అధికార మార్పిడితోనే పూర్తికాదని బాగా తెలుసు. స్వాతంత్రం కోసం  అహింసను మంత్రంగా వల్లించడమూ మార్గం కాదు. అలా అని ఆయన వ్యక్తిగత హింసకే పట్టం కట్టాలని అనుకోలేదు. అతి చిన్న వయసులోనే అపారమైన అధ్యయనం చేసిన ఆయన  సామ్యవాద  అవగాహనకు వచ్చారు. అంతకుముందు కాలంలో దుర్గాదేవి ముందు రక్త ప్రమాణంతో సహా జాతీయ విప్లవకారుల మార్గం ఆవేశం ప్రధానంగా ఉండేది. దాన్ని సంఘటిత పరిచి దానికి ఒక ఏక రూపతను, భావ స్పష్టతను కలిగించారు. హిందుస్తాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీగా ఏర్పరచారు.

ప్రజా భద్రతా చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టం రెండు ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి వచ్చాయి. వాటికి నిరసనగా భగత్‌సింగ్‌ పార్లమెంటులో బాంబులు విసరాలని ప్రతిపాదించడమే కాక అందుకు తానే వెళ్తానని పట్టుపట్టాడు. బాంబులు వేశాక దొరికిపోయి తమ భావాలు లోకానికి చాటాలని నిర్ణయించుకున్నారు గనుక ఆ పనికి ఆయనను పంపడానికి సహచరులు ఒప్పుకోలేదు. చంద్రశేఖర్‌ అజాద్‌ వచ్చాక ఆయన సహాయంతో మరోసారి చర్చ చేయించి తనే వెళ్లేలా నిర్ణయం మార్పించాడు. తన భావాలు గట్టిగా వినిపించాన్నది ప్రధాన ఉద్దేశం.  పార్లమెంటులో అమాయకులకు ముఖ్యంగా భారతీయులకు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పొగబాంబులు మాత్రమే తీసుకెళ్ళాడు. వాటిని విసిరిన తరువాత కరపత్రాలు విసిరి పారిపోవడానికి అవకాశమున్నా విప్లవం వర్థిల్లాలి అని నినదిస్తూ అనుకున్న ప్రకారమే దొరికిపోయాడు. తర్వాత కోర్టులో తన చర్యను సమర్థించుకుంటూ తాము అనవసరంగా చంపబోమని స్పష్టీకరించాడు. విప్లవానికి ఆధారం ఆయుధాలు, దౌర్జన్యకర చర్యలు కావని చెప్పాడు.  మరీ తొలిదశలో కొద్దికాలం తప్ప తానెప్పుడూ టెర్రరిస్టుగా లేనని ప్రకటించాడు. భగత్‌సింగ్‌కు గురువు లాంటి లాలా జలపతిరాయ్‌ ఒక దశలో విప్లవకారులను  వ్యతిరేకించేవారు. అయినా దారుణమైన లాఠీఛార్జీ జరిపి ఆయన మృతికి కారణమైన బ్రిటిష్‌ అధికారులను శిక్షించాలని నిర్ణయించడం భగత్‌సింగ్‌ విశాల దృష్టిని తెలుపుతుంది. వారి భావాలతో ఏకీభవించకపోయినప్పటికీ విఠల్‌భాయ్‌ పటేల్‌, మోతీలాల్‌ వంటివారు భారత ప్రజల ప్రియతమ నాయకులని, అలాంటి వారున్న సభలో తాము ప్రమాదకరమైన బాంబులు విసరడం కలలోనైనా ఊహించలేని విషయమని కోర్టులో ప్రకటించాడు భగత్‌ సింగ్‌.

త్యాగం, సాహసం రెండు రకాలని అంటూ ఉరికంబమెక్కడం కంటే చివరి వరకూ ప్రజల కోసం పనిచేయడంలోనే అత్యధిక త్యాగం ఉన్నదని చెప్పడం ఆయన నమ్రతకు వాస్తవికతకు నిదర్శనం. సుఖలాసకోసమే జీవితంకాదు, లక్ష్య సాధనకు అంకితం కావాలని ఆయన అనేక చోట్ల సందేశమిస్తారు. అయితే అందుకు అధ్యయనం అవసరమని ఆయనకు తెలుసు. అందుకే ఎప్పుడూ పుస్తకాలు వెంటపెట్టుకుని తిరిగేవాడు. భగత్‌ సింగ్‌ దగ్గరకువెళ్తే ఆ జేబులోంచి ఒకటి ఈ జేబులోంచి ఒకటి పుస్తకాలు తీస్తారని మిత్రులు హాస్యమాడేవారు. తనను ఉరితీస్తారని తెలిసిన తర్వాత కూడా పుస్తకాలు ఆపకుండా చదవడమేకాదు.  ఫలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకం దొరుకుతుంది తెచ్చిపెట్టమని మిత్రులకు ఉత్తరం రాయడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత దృఢమైందో అర్థమవుతుంది.  ఆ సమయంలోనూ చదివినవి నోట్సు రాసిపెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మకం కోల్పోరాదన్నది ఆయన సందేశం. ఒకసారి చంద్రశేఖర ఆజాద్‌ ఆత్మహత్య  చేసుకోవడం గురించి ప్రస్తావిస్తే భగత్‌   గట్టిగా ఖండించాడు. ఎట్టిపరిస్తితుల్లోనూ పోరాడాలే గాని ప్రాణాలు తీసుకోవడం తప్పన్నాడు. మత రాజకీయాతో ప్రజను విభజించడం మంచిది కాదని ఆయన పదేపదే చెబుతారు. కేవలం ఒక మతానికి చెందినవారనే కారణంతో ఒక  జన సముదాయాన్ని  ద్వేషించడం మూర్ఖత్వమని కోర్టులో స్పష్టంగా ప్రకటించారు. జలియన్‌ వాలాబాగ్‌కు వెళ్లి పిడికెడు మట్టి జేబులో వేసుకని వచ్చినభగత్‌ సింగ్‌ను షహీన్‌బాగ్‌  గుర్తు చేస్తుంది. పార్లమెంటుపై బాంబులు విసిరిన సమయంలో బ్రిటిష్‌ వారు సభ స్పూర్తిని ఎలా దెబ్బతీసి నిరంకుశ చట్టాలు ఆమోదింపచేసుకుంటున్నారో విమర్శించారు. తాజాగా రైతు  కార్మిక వ్యతిరేక బిల్లుల ఆమోదంలో అచ్చంగా అదే చూశాం. ఇక ఎవరో కొందరు వ్యక్తుల చుట్టూ పరిభ్రమించడం వల్ల ప్రజల జీవితాలు మారబోవని ఆయన పదే పదే చెబుతారు. కాని ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలో  వ్యక్తుల మధ్యనే రాజకీయాల తిప్పుతున్న తీరు చూస్తే ఆ మాటు మరింత బాగా అర్థమవుతాయి.
ప్రేమ కొద్దీ తనను విడిపించేందుకు క్షమాబిక్ష కోసం ప్రయత్నించిన నాన్నపై భగత్‌సింగ్‌ గౌరవంగా ఆగ్రహం వెలిబుచ్చడం ఆయన పరిపక్వతను చెబుతుంది. ఎందుకంటే నాన్న చిన్నాన్న కూడా దేశభక్తులే. ఈ సమయంలో తన సహచరులైన అక్కడి నుంచి తరలించి మెత్తబర్చవచ్చునని  ప్రభుత్వం అనుకుంది. జైలు సూపరింటెండెంట్‌ వారికి చివరిసారిగా భగత్‌సింగ్‌ను కలుసుకునే అవకాశం కలిగించాడు. వారిలో ఒకరైన జయదేవ్‌ కపూర్‌ సర్దార్‌, నీవు చనిపోవడానికి ఇక సిద్ధంగా వున్నావు. ఇందుకు నీవేమీ విచారించడం లేదా? అని అడిగితే, దానికాయన బిగ్గరగా నవ్వి  ఇలా అన్నాడు. ‘విప్లవ పథంలో అడిగిడునప్పుడే నా ప్రాణార్పించి దేశమంతటా ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ విప్లవం వర్థిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింపప చేయగలిగితే జీవితం ధన్యమైపోతుందనుకున్నాను. ఈనాడు జైలు గదిలో కూర్చున్నప్పటికీ కోట్లాది మన ప్రజ కంఠం నుండి మెవడుతున్న ఆ నినాదాన్ని వినగుగుతున్నాను. ఈ నా నినాదం స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉద్దీపింపచేసే శక్తిగా సామ్రాజ్యవాదులను చివరివరకూ దెబ్బతీస్తూనే ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకన్నా మరేం కావాలి?

నిజంగానే భగత్‌ సింగ్‌ నమ్మకం వమ్ము కాలేదు. తన మాటు జీవితం కోట్ల మంది యువతకు నాటికీ నేటికీ ప్రేరణగా కొనసాగుతున్నాయి. యువత ఉద్యమాలు అవసరమని భావిస్తోందని ఇటీవల సర్వేలో కూడా వెల్లడైంది. కరోనాపేరిట హక్కును హరించి నిరసన తెలిపే అవకాశం లేకుండా చేసినా ఆన్‌లైన్‌లోనూ పరిమిత పద్దతులోనూ కూడా ఎక్కడికక్కడ శ్రమజీవులు రైతు వివిధ తరగతల ప్రజలు ఆందోళన సాగిస్తూనేవున్నారు. పార్లమెంటులోనూ నిరసన ప్రతిధ్వనించింది. తెలుగురాష్ట్రాల్లో మతభావను  రగిలించే వ్యూహాలు విఫలమైనాయి. అయితే ఇప్పటికీ  ఆయన ఆశించిన సమగ్ర అవగాహన సమసమాజ సాధన సుదూరంగానే వున్నాయి. అందుకు ఉత్తేజం అందించే  భగత్‌ సింగ్‌ జీవితం త్యాగం సాహసం.

 (సెప్టెంబరు 28 భగత్‌సింగ్‌ 113వ జయంతి)