ఇక భారత జట్టుకు పంత్ తో పనిలేదా..?

ఇక భారత జట్టుకు పంత్ తో పనిలేదా..?

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్‌ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ బెన్ ‌స్టోక్స్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో తనవంతు పాత్ర పోషించాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకొని గొప్ప విజయాన్ని అందించాడు.

గొప్ప ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది‌. 54 పరుగులతో అజేయంగా నిలిచిన అతడిని క్రీడా నిపుణులు, కామెంటేటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే టీమిండియా అభిమానులు సంజూను ప్రశంసిస్తూనే, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషబ్ పంత్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. 'సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి మా మనసు దోచుకున్నాడు. బై బై రిషబ్ పంత్‌. ఇక ఇంటికి వెళ్లి హల్వా, పూరీ తింటూ కూర్చో' అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. 'పంత్‌కు బెస్ట్‌ రీప్లేస్‌మెంట్‌ శాంసన్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తాచాటగల దమ్మున్న ఆటగాడు' అని మరొకరు ట్వీట్ చేశారు. పంత్‌ కంటే సంజూ బెటర్‌ అని చాలామంది పేర్కొంటున్నారు.