వరల్డ్ కప్ లో ధోనీకి ప్రత్యామ్నాయం పంత్ మాత్రమే!!

వరల్డ్ కప్ లో ధోనీకి ప్రత్యామ్నాయం పంత్ మాత్రమే!!

రాబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యామ్నాయం యువ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ మాత్రమేనని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ కి 15 సభ్యుల జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు తరఫున పంత్ బాగా ఆడితే టీమిండియాలో స్థానానికి గట్టి పోటీదారు అవుతాడని పాంటింగ్ చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో పంత్ మైదానంలో ఉండగానే ప్రేక్షకులు 'ధోనీ, ధోనీ' అంటూ కేకలు పెట్టారు. దీనిపై వెబ్ సైట్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ 'కొన్నాళ్ల క్రితం ఏం జరిగిందో పంత్ మరచిపోయేలా చేయడం నాకు, ఇతర కోచింగ్ సిబ్బందికి పెద్ద పని కానుందని అనుకుంటున్నాను. ఇది చివరి మ్యాచ్ లలో జరగడం అతని అదృష్టం. లేకపోతే ఇలాంటి ఒత్తిడిలో ఐదు మ్యాచ్ లు ఆడటం కష్టం అయ్యేది. ఇప్పుడు అతను ఇంతకు ముందు తను ఎంతో బాగా ఆడిన టోర్నమెంట్ లో ఆడబోతున్నాడు.' అని పాంటింగ్ అన్నాడు.

'అతను మాకు ఒకటి రెండు మ్యాచ్ లు గెలిచి పెడితే అంతా ఆ వైఫల్యాన్ని మరచిపోతారు. నాకైతే టీమిండియా వరల్డ్ కప్ టీమ్ లో రెండో వికెట్ కీపర్ గా పంత్ తప్ప మరెవరూ ధోనీకి ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని' పంటర్ చెప్పాడు. ఐపీఎల్ 12వ ఎడిషన్ లో పాంటింగ్ ఢిల్లీ కేపిటల్స్ జట్టు చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.