రోజాకు ఇచ్చే పోస్ట్ ఇదే...!?

రోజాకు ఇచ్చే పోస్ట్ ఇదే...!?

25 మంది మంత్రులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది. కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించడం.. ఆ తర్వాత వారికి సీఎం వైఎస్ జగన్ శాఖలు కేటాయించడం జరిగిపోయాయి. అయితే, కష్టం కాలంలో సైతం వైఎస్ జగన్ వెనకాలే ఉన్న కొందరు సీనియర్లకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆర్కే రోజా విషయం హాట్ టాఫిక్ అయ్యింది. ఇప్పుడు కాకపోయినా.. రెండున్నరేళ్ల తర్వాత ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నా.. కేబినెట్‌లో తనకు స్థానం దక్కపోవడంపై రోజా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సీఎం వైఎస్ జగన్‌ ఆమెకు ఫోన్ చేసి.. విజయవాడలో అందుబాటులో ఉండాలని చెప్పినా.. ఆమె వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రోజాను నియమించే అవకాశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం. 

ఎమ్మెల్యేగా ఉన్న వారిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించ వచ్చా? లేదా? అనేదానిపై ఏపీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవి చేపట్టే వారు పార్టీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నా.. అప్పటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి రోజాకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన రోజాకు.. లీగల్ చిక్కులు లేకుంటే కొన్ని రోజుల వ్యవధిలోనే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కతుందంటున్నాయి వైసీపీ శ్రేణులు.