బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

 బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

కన్నూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఊటీ నుంచి కన్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడు మంది ప్రయాణీకులు మృతి చెందారు. రుతుపవనాల కారణంగా తమిళనాడులో జోరు వానలు పడుతున్నాయి. నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొండ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఇవేమి పట్టించుకోకుండా ఊటీ నుంచి కన్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. బస్సును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో నీలగిరి జిల్లా కున్నూరు ఘాట్ రోడ్ వద్ద వరద నీటిలో అదుపుతప్పి సుమారు 500 అడుగుల మేర లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని నీలగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ఎనమిది కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చనిపోయిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.