పల్టీకొట్టిన క్వాలీస్.. ఇద్దరు విద్యార్థులు మృతి

పల్టీకొట్టిన క్వాలీస్.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పెదమండ్యం మండలానికి చెందిన విద్యార్థులు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్షలు రాసేందుకు బయలుదేరారు. వీరు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచార రథం క్వాలీస్ ఎక్కారు. మార్గమధ్యలో కలిచెర్ల వద్దకు రాగానే.. క్వాలీస్ వాహనం వీల్ కట్ అయి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీనివాస్, రామ్మోహన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రచార రథం జనసేన పార్టీకి చెందినట్టు సమాచారం తెలుస్తోంది.