మహా శివరాత్రికి 'రాబర్ట్'గా దర్శన్!

మహా శివరాత్రికి 'రాబర్ట్'గా దర్శన్!

కన్నడ స్టార్ హీరో దర్శన్ సైతం ఈ యేడాది మహా శివరాత్రి సీజన్ ను టార్గెట్ చేశాడు. అతను నటించిన 'రాబర్ట్' మూవీ మహాశివరాత్రి కానుకగా కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తరుణ్‌ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఆశా భట్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. తరుణ్‌ సుధీర్ తొలి చిత్రం 'చౌక'లో దర్శన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఆ పరిచయంతోనే తన రెండో సినిమాను దర్శన్ తోనే తీశాడు తరుణ్ సుధీర్. నిజానికి 'రాబర్డ్' మూవీ గత యేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో అది మార్చి రెండోవారంలో రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే... ఇప్పటికే మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా తెలుగు సినిమాలు మూడు, నాలుగు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కన్నడ డబ్బింగ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు దొరకుతాయా అనేది సందేహం!