ఈడీ విచారణ కోసం తల్లితో జైపూర్ వచ్చిన రాబర్ట్ వాద్రా

ఈడీ విచారణ కోసం తల్లితో జైపూర్ వచ్చిన రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకవైపు సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ రంగప్రవేశం సందర్భంగా ఆమె వెన్నంటి ఉంటే ఆయన బావ రాబర్ట్ వాద్రా రాజస్థాన్ బికనేర్ లో ఒక భూ కుంభకోణం కేసు విచారణ కోసం జైపూర్ వెళ్లారు. మంగళవారం జైపూర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట వాద్రా, తన తల్లి మౌరీన్ వాద్రాతో కలిసి హాజరు కానున్నారు. ఈడీ గత వారం మూడు రోజుల పాటు మొత్తం 24 గంటలు వాద్రాను ప్రశ్నించింది. 

వాద్రా తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం జైపూర్ భవానీ సింగ్ రోడ్డులోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరవుతారు. వాద్రా, ఆయన తల్లి సోమవారం మధ్యాహ్నం జైపూర్ చేరుకున్నారు. వాద్రా రేపు ఈడీ ఎదుట హాజరైతే ఆయన ఏజెన్సీ ఎదుట నాలుగోసారి హాజరైనట్టు అవుతుంది. గత మూడు సార్లు ఆయన అక్రమ పద్ధతుల్లో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడంలో ఆయన పాత్రపై జరుగుతున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరయ్యారు.

రాజస్థాన్ హైకోర్ట్ ఆదేశాల మేరకు వాద్రా, ఆయన తల్లి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈడీ దర్యాప్తులో సహకరించాల్సిందిగా కోర్టు వారిద్దరికీ సూచించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వాద్రా, ఆయన తల్లి వివరణలు నమోదు చేయనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. 2015లో జరిగిన ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో వాద్రాపై క్రిమినల్ కేసు నమోదైంది. రాజస్థాన్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీట్ లను పరిశీలించిన తర్వాత ఈ కేసును నమోదు చేశారు. బికనేర్ కేసులో ఈడీ వాద్రాకు మూడుసార్లు నోటీసులు పంపింది. కానీ ఆయన హాజరు కాలేదు. చివరికి రక్షణ కోసం కోర్టుకెళ్లారు.