క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌

క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌

స్విట్జర్లాండ్‌ మాస్టర్ రోజర్‌ ఫెడరర్‌ తన దూకుడు ప్రదర్శిస్తూ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్‌ ఫైనల్ కి చేరాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై ఫెడరర్‌ విజయం సాధించాడు. గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఫెడరర్‌ 6–0, 7–5, 6–4తో సునాయాసంగా గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్‌ తలపడనున్నాడు. టాప్ సీడ్ రాఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6–3, 6–3, 6–4తో జిరీ వెసిలీపై విజయం సాధించాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ సునాయాస విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సెరెనా 6–2, 6–2తో రొడీనా(రష్యా)పై గెలుపొందింది. ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌) 3–6, 6–7 (1/7)తో కికి బెర్‌టెన్స్‌(నెదర్లాండ్స్‌) చేతిలో ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్ లలో సిబుల్కో  వా, కెర్బర్‌, ఒస్టాపెంకో, కసత్‌కినా, బెర్‌టెన్స్‌, జూలియా, కామిలాలు కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.