టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 'ఫెదరర్‌' టాప్

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 'ఫెదరర్‌' టాప్

టెన్నిస్ స్టార్, స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ తాజాగా ఐసీసీ ప్రవేశపెట్టిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని పొందాడు. టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించడం ఏంటి.. అది కూడా కోహ్లీ, రూట్, ఫించ్, విలియమ్ సన్, పుజారా వంటి టాప్ టెస్ట్ బ్యాట్స్ మెన్స్ లను కాదని నంబర్‌వన్‌ స్థానాన్ని పొందడమేంటని ఆశ్చర్యపోతున్నారు కదా..!. ఇదంతా నిజమే.

ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో ఫెడరర్‌ తన దూకుడు ప్రదర్శిస్తూ క్వార్టర్‌ ఫైనల్ కి చేరాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై ఫెడరర్‌ విజయం సాధించాడు. ఇదే మ్యాచ్ లో ఫెదరర్ ఓ బంతిని క్రికెట్ షాట్ ఆడాడు. క్రికెట్ లో కనిపించే ఫార్వార్డ్ డిఫెన్స్ షాట్ ను  తన రాకెట్ తో ఫెదరర్ ఆడాడు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే వీడియోను వింబుల్డన్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.. ఈ క్రికెట్ షాట్ ఆడినందుకు ఫెదరర్ కు ఎంత రేటింగ్ ఇస్తారని ఐసీసీని కోరింది. ఐసీసీ టెస్టుల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ వైరల్ వీడియోను మీరూ చూడండి.