రోహిత్ @ 200

రోహిత్ @ 200

భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌లో మరో డబుల్‌ సెంచరీ కొట్టాడు. అయితే ఇది పరుగులతో మాత్రం కాదు. ఈ రోజు రోహిత్ కెరీర్‌లో 200వ వన్డే మ్యాచ్‌ ఆడుతున్నాడు. టీంఇండియా తరఫున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడు రోహిత్‌. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) సాధించిన రోహిత్ ఈ స్పెషల్ వన్డేలో స్పెషల్ గా ఆడుతాడేమో చూడాలి. 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆరేళ్ల పాటు రోహిత్‌ ప్రతీ సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 

రోహిత్ కెరీర్ చూసుకుంటే 2012 ముందు.. తర్వాత అని చెప్పుకోవచ్చు. 2007లో తొలి వన్డే ఆడిన రోహిత్ తొలి ఆరేళ్ల పాటు అంతగా రాణించలేదు. ఆస్ట్రేలియాలో 2008 సీబీ సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో దక్షిణాఫ్రికాలో ఓపెనర్‌గా వచ్చి 23, 1, 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో 2011 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కలేదు. 2012 చివర్లో ఆఖరి ఆరు ఇన్నింగ్స్‌లలో 5, 0, 0, 4, 4, 4 స్కోర్ చేయడంతో కెరీర్ ముగిసే ప్రమాదంలో పడింది. 2013 జనవరిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ ధోని మరోసారి రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాడు. ఆ మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. జూన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీతో రెగ్యులర్‌ ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఆస్ట్రేలియాపై సాధించిన తొలి డబుల్‌ సెంచరీ రోహిత్ కెరీర్‌ ను మార్చేసింది. అనంతరం మరో రెండు డబుల్‌ సెంచరీలు చేసి తనకు ఎదురులేదని నిరూపించాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో రికార్డులు తన పేరున రాసుకున్నాడు. మూడో వన్డే తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి నేపథ్యంలో.. ఈ రోజు జట్టు సారథ్య బాధ్యతలు కూడా అందుకున్నాడు.