టీమిండియాకు మద్దతివ్వండి...

టీమిండియాకు మద్దతివ్వండి...

టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ భారత క్రికెట్‌ జట్టుకు మద్దతుగా నిలిచారు. సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 107 పరుగులకే కుప్ప కూలింది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, అమితాబ్‌‌లు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. జట్టు కష్టాలో ఉన్నపుడు అభిమానులు కూడా మద్దతుగా నిలిచి ప్రోత్సహించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. 'ఈ ఆటగాళ్లే టీమిండియాకు టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు అందించారు.. అది మర్చిపోవద్దు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లకు మద్దతివ్వండి.. ఇది మన జట్టు’ అని రోహిత్‌ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ‘నేను అంగీకరిస్తున్నాను. కమాన్‌ ఇండియా. మనం చేయగలం’ అని రోహిత్ ట్వీట్‌కు అమితాబ్‌ స్పందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.