రోహిత్‌ శర్మ మరో సెంచరీ...మరో మూడు రికార్డులు బద్దలు

రోహిత్‌ శర్మ మరో సెంచరీ...మరో మూడు రికార్డులు బద్దలు

టీమ్ ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. దక్షిణాఫ్రికాతో వైజాగ్ లో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 176 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అలా  టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ వరల్డ్ రికార్డ్ సాధించాడు.

అదే కాక దశాబ్దాల నాటి మరో రెండు రికార్డ్స్ బద్దలయ్యాయి. ఇప్పటి వరకూ 1994లో లక్నో వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్దు బాదిన 8 సిక్సర్ల రికార్డ్ భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా తాజాగా రోహిత్ శర్మ 10 సిక్సర్లతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అలాగే టెస్టుల్లో వరుసగా ఏడు అర్ధశతకాలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకూ రాహుల్ ద్రవిడ్ ఆరు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా తాజాగా ద్రవిడ్‌ని రోహిత్ వెనక్కి నెట్టాడు.

మరోవైపు తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు. కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. మయాంక్ తర్వాత రోహిత్ కు జత కలిసిన పుజారీ అద్భుతంగా ఆడి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 254 పరుగులు. జడేజా 22, కోహ్లీ 7 పరుగులో క్రీజులో ఉన్నారు.