ఆ రికార్డులు రోహిత్‌ ఖాతాలో చేరేనా?

ఆ రికార్డులు రోహిత్‌ ఖాతాలో చేరేనా?

న్యూజిలాండ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భార‌త జ‌ట్టు ఐదు వ‌న్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అదే ఊపులో మూడు టీ20ల సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది.  రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో.. 'హిట్‌మ్యాన్' రోహిత్ శ‌ర్మ టీ20 సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి.

న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టీ20 మ్యాచ్‌ను కూడా గెల‌వ‌లేదు. చివరిసారిగా 2008-09లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేతృత్వంలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించింది. ఈ నేప‌థ్యంలో రేపు ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ గెలిచినా.. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీ20 మ్యాచ్ గెలిచిన తొలి భార‌త కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇక సిరీస్ గెలిస్తే.. న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా కూడా రోహిత్ నిలవనున్నాడు. అయితే రోహిత్‌ రెండు రికార్డులలో ఒక్కటైనా సాధించేనా? అంటే అనుమానమే?. ఎందుకంటే కివీస్ జట్టు టీ20లలో అద్భుతంగా రాణించడమే. పైగా ఆడేది వారి సొంత గడ్డపై. కాబట్టి టీంఇండియా సమిష్టి ప్రదర్శన చేసి విజయవంతం అయితేనే రోహిత్ ఖాతాలో ఆ రికార్డులు చేరుతాయి.