ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హిట్ మ్యాన్

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హిట్ మ్యాన్

టెస్టుల్లో ఓపెనర్‌ గా రోహిత్ శర్మ రాణించగలడా అన్న కోట్ల ప్రశ్నలకు తనదైన శైలిలో బ్యాటుతోనే సమాధానమిచ్చాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌. ఓపెనర్‌గా ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు, ఒక డబుల్‌ సెంచరీతో అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు. ఒకే టెస్ట్‌ సిరీస్‌లో 5 వందలకు పైగా స్కోర్ చేసిన భారత ఓపెనర్లలో ఐదో వాడిగా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు. అంతకంటే ముందు వినోద్‌ మాన్కడే, బుధి కుందరన్, సునిల్‌ గావాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ ఘనత సాధించారు. సిక్సర్ల మారు పేరుగా మారిన హిట్‌మ్యాన్‌ ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులెక్కాడు.

విండీస్‌ ప్లేయర్‌ హెట్‌మేయర్‌ 15 సిక్సర్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ సిరీస్‌లో 18 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌. ఇక ఈ టెస్టు సిరీస్‌ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో రోహిత్‌(212) డబుల్‌ సెంచరీ సాధించడంతో ఒక అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత్‌ ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో రోహిత్‌ చేసిన పరుగుల్ని కూడా సఫారీలు తమ ఇన్నింగ్స్‌లో సాధించలేకపోయారు.