రోహిత్ మెరుపులు.. 71 ఏళ్ల రికార్డుతో పాటు పలు రికార్డులు బ్రేక్..

రోహిత్ మెరుపులు.. 71 ఏళ్ల రికార్డుతో పాటు పలు రికార్డులు బ్రేక్..

రాంచీలో డబుల్‌ సెంచరీ బాదిన హిట్‌మ్యాన్‌ రికార్డుల మోత మోగించాడు. సఫారీలతో తొలి టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన హిట్‌మ్యాన్‌.. రాంచీ టెస్ట్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌గా ఈ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.. ఫస్ట్‌ టెస్ట్‌లో రికార్డుల మోత మోగించిన రోహిత్‌ రాంచీ టెస్ట్‌లో ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన క్రికెటర్‌గా బ్రాడ్‌మన్ (98.22 సగటుతో) ఉండగా, తాజాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్వదేశంలో ఆడిన గత పది టెస్టుల్లో సగటు 99.84. ఏ ఆటగాడైనా గత పది ఇన్నింగ్స్‌ల్లో సాధించిన సగటును పరిగణలోనికి తీసుకొని ఈ రికార్డును ప్రకటిస్తారు.

ఈ మ్యాచ్‌లో 212 పరుగులతో సత్తా చాటిన రోహిత్‌ సౌతాఫ్రికాతో ఒక సిరీస్‌లో 150కి పైగా రెండుసార్లు చేసిన తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా కొత్త అధ్యయాన్ని లిఖించాడు. సిక్సర్లు మారు పేరుగా మారిన హిట్‌మ్యాన్‌ ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులెక్కాడు. విండీస్‌ ప్లేయర్‌ హెట్‌మేయర్‌ 15 సిక్సర్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ సిరీస్‌లో 18 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లోనూ, లిమిటెట్‌ ఫార్మాట్‌లోనూ డబుల్‌ సెంచరీలు కొట్టిన ఓవరాల్‌ నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ నిలిచాడు. సచిన్, సెహ్వాగ్‌, గేల్‌ మాత్రమే రెండు ఫార్మాట్లలో డబుల్‌ సెంచరీలు చేశారు. సఫారీపై ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు హిట్‌మ్యాన్‌. ఈ సిరీస్‌లో 529 పరుగులు చేసిన రోహిత్.. మాజీ కెప్టెన్‌ అజహార్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఒక సిరీస్‌లో భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో  సునీల్‌ గావస్కర్‌ తర్వాత ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్‌. గావస్కర్‌ తర్వాత ఇంత కాలానికి ఒక సిరీస్‌ కనీసం మూడు సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్‌ శర్మ చేరిపోయాడు.