జగన్ బాహుబలి, గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డి !

జగన్ బాహుబలి, గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డి !

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాహుబలివంటి వారని, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారిని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పొగడ్తల వర్షం కురిపించారు. వీరిద్దరూ పెద్ద పారిశ్రామికవేత్తలని, వీరిద్దరూ కలసి ఏపీకి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకొస్తారని ఆమె చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్దేశించిన సమయంలోనే పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తామని పైసా లంచం తీసుకోకుండానే అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని రోజా తెలిపారు.

కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురానున్నామని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు ఆమె తెలిపారు. స్థానికుల ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని కోరారు. పరిశ్రమలకి గత ప్రభుత్వం అధిక రాయితీలు తెచ్చి ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రతీ మూడు నెలలకొకసారి పారిశ్రామిక వేత్తలని కలిసి సమస్యలు తెలుసుకుంటామని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.