హమ్మయ్య.. బెంగళూరు గెలిచింది..

హమ్మయ్య.. బెంగళూరు గెలిచింది..

ఐపీఎల్ 2019 ప్రారంభం నుంచి వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టుడుగుపడిపోయిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఎట్టకేలకు ఈ సీజన్‌ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐపీఎల్‌-12లో బెంగళూరు పరాజయ పరంపరకు తెరపడింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన ఆర్‌సీబీ.. ఏడో మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. 8 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. విరాట్ కోహ్లి, డివిలియర్స్‌ సత్తా చాటడంతో 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

తొలుత బ్యాటింగ్‌  చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది... కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులు చేయగా... గేల్‌ 99 (నాటౌట్‌) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు, మయాంక్‌ 15 పరుగులు చేశారు. ఇక 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కోహ్లి, డివిలియర్స్‌ విజృంభించడంతో విజయాన్ని అందుకుంది. కోహ్లి 67 పరుగులు, డివిలియర్స్‌ 59 (నాటౌట్‌) పరుగులతో బెంగళూరు విక్టరీలో కీలక పాత్ర పోషించారు. 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌: కేఎల్‌ రాహుల్‌ 18 గేల్‌ 99 (నాటౌట్‌), మయాంక్‌ 15, సర్ఫ్‌రాజ్‌ 15, కరన్‌ 1, మన్‌దీప్‌ 18 పరుగుల చేయగా... ఆర్‌సీబీ బౌలర్లు చాహల్ 2 వికెట్లు, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌: పార్థివ్‌ పటేల్‌ 19, విరాట్ కోహ్లి 67, డివిలియర్స్‌ 59 (నాటౌట్‌), స్టాయినిస్‌ 26 (నాటౌట్‌) పరుగులు చేయగా... పంజాబ్ బౌలర్లు షమి ఒక వికెట్, రవిచంద్రన్‌ అశ్విన్ ఒక వికెట్ తీశారు.