ఐపీఎల్12 నుంచి బెంగళూరు నిష్క్రమణ

ఐపీఎల్12 నుంచి బెంగళూరు నిష్క్రమణ

ఐపీఎల్‌ 12 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిష్క్రమించింది. మంగళవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇరు జట్ల చెరో పాయింటుతో సరిపెట్టుకున్నాయి. రాత్రి 7:30 గంటలకు టాస్‌ వేసిన తర్వాత స్టేడియంలో వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఐదు ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఏబీ డివిలయర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో యువ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ (3/12) హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 3.2 ఓవర్లలో 41/1తో ఉన్న దశలో మరోసారి వర్షం పడటంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సంజూ శాంసన్ (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అతనికి తోడుగా లివింగ్‌ స్టన్‌ (7 బంతుల్లో 11 నాటౌట్‌: 1ఫోరు, 1సిక్స్) రాణించాడు. మ్యాచ్‌ రద్దు కావడంతో ఐపీఎల్‌ 12 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిష్క్రమించింది.