ముస్లిం గెటప్ పై కోర్టుకు వెళ్తాం: ఆదివాసీలు

ముస్లిం గెటప్ పై కోర్టుకు వెళ్తాం: ఆదివాసీలు

తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టీజర్‌‌ వివాదం రేపుతోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఆదివాసీల వీరుడు, మన్యం పులి ముద్దుబిడ్డ కొమురం భీమ్ వీరత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా టీజర్ ఉండడంతో ఈ సినిమాపై అబిమానుల అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. అయితే తమ ఆదివాసీ నాయకుడిని కించపరిచేలా చిత్రీకరించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని లేదంటే దీనిపై కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని ఆదివాసీ సంఘాలు చిత్రయూనిట్‌ను హెచ్చరిస్తున్నాయి. చరిత్రను వక్రీకరించకుండా సినిమా నిర్మాణం చేపట్టాలని కొందరు సూచిస్తుంటే, మరికొందరు మాత్రం ఫిక్షనల్ అని ముందే చెప్పారుగా అంటూ రాజమౌళికి మద్ధతు తెలుపుతున్నారు.