ఐదేళ్లలో బ్యాంకులకు లక్ష కోట్లు టోకరా!

ఐదేళ్లలో బ్యాంకులకు లక్ష కోట్లు టోకరా!

తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి కోట్లకు కోట్లకు రుణాలు తీసుకోవడం... అది మోసం అని బ్యాంకులు గ్రహించేలోపే తట్టాబుట్టా సర్దుకుని బడా పారిశ్రామిక వేత్తలు దేశాన్ని దాటిపోతున్నారు. వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9000 కోట్లు ఎగవేసి లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా లండన్ చెక్కేస్తే... ఇక వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ... ఏకంగా దాదాపు 13 వేల కోట్లు మోసం చేసి విదేశాల్లో తలదాచుకున్నాడు. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలతో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్ల కాలంలో దేశంలోని వివిధ బ్యాంకులు రూ. లక్ష కోట్లు మోసపోయాయని పేర్కొంది ఆర్బీఐ. 

సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... బ్యాంకులను మోసం చేసిన కేసులు 23 వేలుగా పేర్కొంది. ఇక ఏప్రిల్ 2017 నుంచి 2018 మార్చి 1 వరకే 5,152 మోసం చేసిన కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఆర్బీఐ. ఈ ఏడాది కాలంలోనే అత్యధికంగా రూ.28,459 కోట్లు బ్యాంకులు నష్టపోయినట్టు తెలిపింది. ఇక 2016-17లో 5,076 కేసులు నమోదైతే వీటి ద్వారా రూ.23,933 కోట్ల ఫ్రాడ్ జరగగా... 2013, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 23,866 కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష 718 కోట్లు బ్యాంకులు నష్టపోయినట్లు ఆర్బీఐ తన సమాధానంలో పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా నల్లధనంపై ఓవైపు... బ్యాంకు మోసాలపై మరోవైపు సీబీఐ, ఈడీ దర్యాప్తును వేగవంతం చేస్తున్న సమయంలో ఆర్బీఐ సమాధానం చర్చనీయంగా మారింది.