బీహార్ లో ఆ స్వతంత్ర అభ్యర్థి ఆస్తులు రూ.1,107 కోట్లు!!

బీహార్ లో ఆ స్వతంత్ర అభ్యర్థి ఆస్తులు రూ.1,107 కోట్లు!!

పేరు రమేష్ కుమార్ శర్మ. మొత్తం ఆస్తిపాస్తులు రూ.1107 కోట్లు. ఈ అపర కుబేరుడు బీహార్ లోని పాటలీపుత్ర లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఏడో దశలోనే కాదు.. ఈ లోక్ సభ ఎన్నికల్లోనే అత్యంత ధనవంతుడైన అభ్యర్థి. సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఏడో దశ అభ్యర్థులపై వెల్లడించిన రిపోర్టులో రమేష్ కుమార్ శర్మ ఈ ఎన్నికల్లోనే అతిపెద్ద ఆస్తిపరుడని పేర్కొంది. అంతేకాదు.. 2002 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద అభ్యర్థుల ఆస్తి వివరాలు తప్పనిసరి చేసిన తర్వాత దేశంలో మూడో ధనవంతుడైన అభ్యర్థని ఏడీఆర్ తేల్చింది. ఏడీఆర్ ఏడో దశలో ఎన్నికలు జరగనున్న 59 సీట్లలో పోటీ చేస్తున్న 918 మంది అభ్యర్థుల అఫిడవిట్లు విశ్లేషించిన తర్వాత ఈ రిపోర్ట్ తయారు చేసింది. 

రమేష్ శర్మ ఓడల రీసైక్లింగ్ కి సంబంధించిన కంపెనీ యజమాని. ఎన్నికల ప్రచార సందర్భంగా తాను గెలిస్తే ఏటా పాటలీపుత్రలోని వెయ్యి మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో రమేష్ కుమార్ శర్మకు ప్రజల నుంచి భారీ ఎత్తున సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈయన బీజేపీకి చెందిన రామ్ కృపాల్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె..మహాకూటమి అభ్యర్థి మీసా భారతితో తలపడుతున్నారు. శర్మకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రధాన పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కోక తప్పేలా లేదు.