స్టాక్‌ మార్కెట్‌ః ఇవాళ సెకనుకు రూ.8 కోట్ల నష్టం

స్టాక్‌ మార్కెట్‌ః ఇవాళ సెకనుకు రూ.8 కోట్ల నష్టం

షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఇవాళ్టి ట్రేడింగ్‌ ఓ పీడకలగా మారింది. ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైన ట్రేడింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. అంటే 375 నిమిషాల్లో ఇన్వస్టర్ల దగ్గరున్న షేర్ల విలువ రూ. 1.79 లక్షల కోట్లు తగ్గిపోయింది. అంటే సెకనుకు ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం రూ. 8 కోట్ల వరకు ఉంది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల షేర్ల విలువ ఇవాళ ఉదయం  రూ.145.43 లక్షల కోట్ల నుంచి రూ. 143.64 కోట్లకు తగ్గింది.  సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి నేటి వరకు అంటే 22 ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.15.74 లక్షల కోట్లు తగ్గింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ క్షీణించి 73కంటే దిగువకు పడివపోవడంతో షేర్‌ మార్కెట్‌లో కలకలం రేగింది. డాలర్‌ బలంగా ఉండటంతో పాటు ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉండటంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ సహా ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్లను దాటింది. దీంతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. డాలర్‌తో రూపాయి 75కు చేరుతుందని, అలాగే క్రూడ్‌ ధర 88 నుంచి 90 డాలర్లకు చేరే అవకాశముందని మార్కెట్‌  వర్గాలు అంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నాయి. అనేక షేర్లు 200 దినసరి చలన సగటు (డీఎంఏ) దిగువకు రావడంతో దీర్ఘ కాలిక ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడుల గురించి పునరాలోచనలో పడ్డారు.