రూ.2 వేల నోటు బంద్‌..! మళ్లీ రూ. వెయ్యి నోటు..!?

రూ.2 వేల నోటు బంద్‌..! మళ్లీ రూ. వెయ్యి నోటు..!?

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేసిన తర్వాత కరెన్సీ కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడాల్సి వచ్చింది.. ఆ తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోటు తెచ్చినా చిల్లర కష్టాలు ప్రజలు వెంటాడాయి.. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తెచ్చినా పాత నోట్లను కూడా కొనసాగిస్తోంది ఆర్బీఐ. కొత్తగా రూ.2 వేలు, రూ.200 మినహా మిగతావన్నీ గతంలో ఉన్న కరెన్సీయే.. అయితే. తాజాగా రూ.2 వేల నోటు ముద్రను కూడా ఆపేసింది ఆర్బీఐ.. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐయే వెల్లడించింది. ఇక, రూ.2 వేల కరెన్సీ నోటు బ్యాన్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.. దానికి తగ్గట్టుగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ తన ఏటీఎంల్లో రూ.2 వేల నోట్లను ఉంచే.. క్యాసెట్లను తొలగించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.. మరోవైపు ఇప్పుడు.. మళ్లీ రూ. వెయ్యి నోటు మార్కెట్‌లోకి రానుందనే చర్చ ప్రారంభమైంది.. అంతేకాదు కొత్త రూ.వెయ్యికి కరెన్సీ నోటుకు సంబంధించిన ఓ మోడల్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.. ఇది కాస్త వైరల్ చేసేశారు.. అయితే, ఇది ఫేక్ న్యూస్‌గానే భావించాల్సి వస్తోంది.. ఎందుకంటే రూ. వెయ్యి నోటుపై ఇప్పటి వరకు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఏ నమూనాను కూడా విడుదల చేయలేదు. కాగా, గతంలోనూ రూ.వెయ్యి నమూనా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.