సడక్ బంద్ వాయిదా...నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

సడక్ బంద్ వాయిదా...నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కంటిన్యూ అవుతోంది. JAC  నేతలు దీక్షలు విరమించినా సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ఈనాటి సడక్‌ బంద్‌ ను మాత్రం వాయిదా వేశారు. అటు హైకోర్టులో సమ్మె విచారణ ముగియగా అది కార్మిక న్యాయస్థానం ముందుకు వెళ్లింది. ఆందోళనల మధ్య ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి  నిరాహార దీక్ష విరమించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...శనివారం తమ నివాసంలో దీక్ష ప్రారంభించిన వీరిని పోలీసులు బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  జేఏసీ నేతల ఆరోగ్యం క్షీణించడంతో...నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు విపక్ష నేతలు. అలాగే ఇవాళ్టి సడక్‌ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నేతలు.

యూనియన్ కమిటీలతో సమావేశమై ఆర్టీసీ సమ్మెపై  నిర్ణయం ప్రకటిస్తామన్నారు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్దామ రెడ్డి.  కోర్టు నుంచి పూర్తి జడ్జిమెంట్ కాపీ అందుకున్నాక తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు జేఏసీ నేతలు. అయితే, ఎప్పటిలాగే డిపోల ముందు ఆందోళనలు కొనసాగించాలని కార్మిక నేతలకు పిలుపునిచ్చారు జేఏసీ లీడర్లు.  మరోవైపు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్‌, ఇల్లీగల్‌ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది.