నేడు తెలంగాణ బంద్...ఎటూ తేల్చని ప్రభుత్వం

నేడు తెలంగాణ బంద్...ఎటూ తేల్చని ప్రభుత్వం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కీలక దశకు చేరుకుంది. రెండు వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ఇవాళ తెలంగాణ బంద్ తో మరింత ఉధృతంగా మారనుంది. రాష్ట్ర బంద్ కు అధికార టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు ఆటోయూనియన్లు...క్యాబ్ డ్రైవర్లు కూడా సంఘీభావం తెలిపారు.  ఇవాళ్టి బంద్‌కు రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు  ప్రకటించాయి. దీంతో ఇవాళ తెలంగాణలో మొత్తం రవాణా వ్యవస్థే స్తంభించిపోయే అవకాశం కనిపిస్తోంది. పబ్లిక్...ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు రెండూ లేకపోవటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు  తప్పేలా లేవు. ఇక మరోపక్క అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం బెట్టువీడకపోవడం, మెట్టుదిగకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు జారీ చేసింది.

జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీకి చెందిన రెండు యూనియన్లతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కార్మికుల డిమాండ్లపై స్పందించి మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది చర్చల వివరాలను 28లోగా తమకు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. ఆర్టీసీ సమ్మె చేపట్టి రెండు వారాలవుతుంది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానం కూడా  అసంతృప్తితో ఉంది.  ఇలాంటి సమయంలో సమ్మె చర్చలకు వస్తుందా... రెండు పక్షాలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.