ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె సన్నాహక కార్యక్రమాలు జనవరి 25 నుంచి నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జనవరి 31న నిరాహార దీక్షలకు దిగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్ధికంగా సంస్థను ఆదుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బందిని తగ్గించి నష్టాలను అధిగమించాలని ఆర్టీసీ భావిస్తుందని ఆరోపించారు. కేవలం ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీ నష్టపోయింది. పల్లెవెలుగు బస్సుల ద్వారా ఏడాదికి రూ.700 కోట్లు నష్టం వస్తుందని తెలిపారు. ప్రైవేట్ అక్రమ రవాణాను అరికట్టి, ప్రభుత్వం వెంటనే రూ.3,200 కోట్లు తక్షణ సాయంగా అందించాలని డిమాండ్ చేశారు.

వేతన సవరణ పై గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య నిన్న విజయవాడలో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో 8 కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు సిద్దమవుతున్నాయి. వీరికి అధికారుల సంఘం కూడా మద్దతు పలుకుతుంది. ఆర్టీసీలోని 52వేల మంది కార్మికులకు 2017 ఏప్రిల్ 1న వేతన సవరణ చేయాల్సి ఉంది. 21 నెలలుగా జాప్యం చేస్తున్న యాజమాన్యం గుర్తింపు సంఘమైన ఎన్ఎంయూ ఒత్తిడితో 19 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. ఈయూ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. డిసెంబర్ 31న ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. పలు దఫాలుగా జరుగుతున్న చర్చలు మంగళవారం మరోసారి జరిగాయి. 15 నుంచి20 శాతం షిట్ మెంట్ కు యాజమాన్యం ప్రతిపాదించింది. ఆర్ధిక ఇబ్బందులు, డీజిల్ ధరల పెరుగుదల, అప్పులకు వడ్డీలు అన్ని కలిపి రూ. 3,720 కోట్లు ఆర్టీసికి అవసరమని ఎండీ సురేంద్రబాబు తెలిపారు.