థియేటర్ల ఆక్యుపెన్సీ విషయమై అమిత్ షా కు ఎస్.థాను లేఖ

థియేటర్ల ఆక్యుపెన్సీ విషయమై అమిత్ షా కు ఎస్.థాను లేఖ

ప్రముఖ నిర్మాత, ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎంపికైన ఎస్. థాను కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల ఆక్యుపెన్సీని 100 శాతం చేయడాన్ని కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో థాను ఈ లేఖ రాయడం విశేషం. కొవిడ్ 19 కారణంగా చిత్రసీమ కోలుకోలేని దెబ్బ తిందని, దాని నుండి కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో దాదాపు 500 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, కేంద్రం చెబుతున్నట్టు యాభై శాతం ఆక్యుపెన్సీతో వీటిని విడుదల చేయలేమని ఆయన అన్నారు. ఎయిర్ లైన్స్, బస్ సర్వీసులలో నూరు శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకునే థియేటర్లకు 50 శాతం పరిమితిని విధించడం తగదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. లేదంటే కనీసం పొంగల్, సంక్రాంతి, లోహ్రి, రిపబ్లిక్ డే సీజన్ లో అయినా నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకునే వెసులుబాటు కల్పించాలని ఎస్. థాను కోరారు. ఇదే లేఖను అమిత్ షా తో పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి పంపారు.