కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత

శబరిమల వివాదంతో కేరళలో సీపీఎం కార్యకర్తలకు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కన్నూరు జిల్లాలో రాత్రి మొత్తం దాడులు జరిగాయి. తలస్సేరిలోని ఎన్టీవో సంఘం నాయకుని ఇంటిపై బాంబులతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదే ప్రాంతంలో కొంత మంది బీజేపీ నాయకుల ఇళ్లపై కూడా దాడులు జరగడంతో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆ ప్రాంతంలో నిరసనలు చేపట్టమని బీజేపీ, సీపీఎం నేతలు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన శాంతి సమావేశంలో అంగీకరించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ ఈనెల 3వ తేదిన హర్తాళ్ కు పిలుపు ఇచ్చిన నాటి నుంచి శనివారం రాత్రి వరకు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 1,286 కేసులు నమోదు చేసి 3,282 మందిని అరెస్ట్ చేసినట్లు కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా తెలిపారు. 50 ఏళ్ల లోపున్న ఇద్దరు మహిళలకు పోలీసు భద్రతతో ఈనెల 2న శబరిమల ఆలయ ప్రవేశాన్ని కల్పించిన నాటి నుంచి హింసాత్మక ఘటనలతో కేరళ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.