బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించండి

బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించండి

శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిద్దరికి 24గంటలు రక్షణ కల్పించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత శబరిమల ఆలయంలోకి మొత్తం 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందచేసింది. అయ్యప్పను దర్శించుకున్న మొత్తం 51 మంది మహిళల జాబితాను అందచేసింది. ఈనెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. 

 ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలపై దాడి చేస్తామని అయ్యప్ప భక్తులు ప్రకటించడంతో ఆ మహిళలు కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత అత్తగారింటికి వచ్చిన కనకదుర్గపై హిందూ సంప్రదాయాలను మంటగలిపావంటూ ఆమె అత్త దాడి చేసింది. తలకు గాయమైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తమపై మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఇద్దరి మహిళలు... తమకు భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.