శబరిమలలో ఇద్దరు ఆంధ్ర మహిళల అడ్డగింత

శబరిమలలో ఇద్దరు ఆంధ్ర మహిళల అడ్డగింత

సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ శబరిమలలో ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆందోళనకారులు మహిళల ఆలయ ప్రవేశాన్ని నిరసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలను ఉదయం ఆలయంలోకి ప్రవేశానికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు మహిళలు పంబా బేస్‌ క్యాంపు నుంచి ఆలయానికి కాలినడకన వెళ్తుండగా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆలయంలోకి అనుమతించబోమని, తిరిగి వెళ్లిపొమ్మని వారు నినాదాలు చేశారు. మహిళలు మాట్లాడుతూ, శబరిమలలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మాకు తెలియదని తెలిపారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దరు మహిళలు వెనుదిరిగారు. ఆలయం తెరిచిన నాటి నుంచి ఇప్పటివరకూ 8 మంది మహిళలు ఆలయప్రవేశానికి ప్రయత్నించారు.  మొన్న యాభై ఏళ్లలోపు వయసు ఉన్న ఇద్దరు మహిళలు బంగారు మెట్ల వరకూ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే గుడి మూసేస్తానని ప్రధాన పూజారి చెప్పడంతో వెనుదిరిగారు. పోలీసులు మాత్రం మహిళా భక్తులు భయపడాల్సిన అవసరంలేదని, తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అంటున్నారు. 

మరోవైపు పంబలోని పోలీస్ స్టేషన్‌ను ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసుల తీరుకు నిరసనగా నీలక్కల్, పంబ సహా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఆందోళనకారులు మోహరించారు. మహిళా భక్తులు ఆలయానికి రాకుండా అడ్డుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో శబరిమల ఆలయ ద్వారాలు ముసివేస్తుండటంతో ఎలాగైనా అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని కొందరు మహిళా హక్కుల నేతలు ప్రయత్నిస్తున్నారు. మహిళలను ఎట్టిపరిస్థితుల్లో ఆలయంలోకి అడుపెట్టనీయబోమని అయ్యప్ప భక్తులు హెచ్చరిస్తున్నారు.