కేసీఆర్‌తో సబితాఇంద్రారెడ్డి భేటీ..

కేసీఆర్‌తో సబితాఇంద్రారెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి... తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్న ఆమె.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కుతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శంషాబాద్‌లో నిర్వహించిన రాహుల్ గాంధీ బహిరంగసభలో కార్తీక్‌రెడ్డికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. అంతకుముందు రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సీటు విషయంలో టి.పీసీసీ వ్యవహరించిన తీరుపై అసంతృప్తితో ఉన్నారు సబిత. అంతే కాకుండా చేవెళ్ల ఎంపీ సీటుపై కూడా అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో సబిత, కార్తీక్ రెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు... ఆయన కూడా కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.