ఎలాంటి ప్రతిఫలం పొందడంలేదుః సచిన్

ఎలాంటి ప్రతిఫలం పొందడంలేదుః సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సచిన్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ (రిటైర్డ్) డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడైన సంజీవ్ గుప్తా చేసిన ఫిర్యాదు మేరకు సచిన్ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణతో జైన్ ఈ నోటీసులు పంపారు. 

అయితే ఈ నోటీసులపై తాజాగా సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ మేరకు వివరణ ఇస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను సచిన్ ఖండించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ నుంచి తాను ఎలాంటి ప్రతిఫలం పొందలేదని, అలాగే ఆ జట్టులో ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడంలేదని సచిన్ లేఖలో తెలిపారు. తాను క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌ కు కేవలం ఒక ‘ఐకాన్’గా మాత్రమే వ్యవహరిస్తున్నాని చెప్పారు. అంతేకానీ, ఫ్రాంచైజీలో తానొక ఉద్యోగిగా కొనసాగడంలేదని స్పష్టం చేశారు. 

2015లో తనను క్రికెట్ అడ్వైసరీ కమిటీ సభ్యుడిగా బీసీసీఐ నియమించడానికి ముందే తాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో పనిచేస్తున్నానని సచిన్ గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రస్తుతం తాను ముంబై ఇండియన్స్
మేనేజ్‌మెంట్ లేదా పాలకవర్గంలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి తాను నిబంధనలను ఉల్లంఘించలేదని లేఖలో పేర్కొన్నారు. తాను ముంబై ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ విచారణను కొనసాగించాలనుకుంటే తన న్యాయ నిపుణులతో కలిసి వ్యక్తిగత విచారణకు తనను అనుమతించాలని సచిన్ కోరారు.