పాక్ ని చిత్తు చేయాలి.. ఆడకుండా 2 పాయింట్లు ఇవ్వొద్దు

పాక్ ని చిత్తు చేయాలి.. ఆడకుండా 2 పాయింట్లు ఇవ్వొద్దు

గత వారం పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఏకకంఠంతో కోరుతోంది. ఈ సందర్భంగా లెజెండరీ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ మాత్రం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఆడాల్సిందేనని అంటున్నాడు. పాకిస్థాన్ తో జూన్ 16న ఆడాల్సిన మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో లిటిల్ మాస్టర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది. శుక్రవారం బీసీసీఐ క్రికెట్ పరిపాలక మండలి (సీఓఏ) ఇదే విషయంపై సమావేశమైంది.

కొద్ది రోజుల క్రితమే టర్బనేటర్ హర్భజన్ సింగ్ అందరి కంటే ముందుగా పాక్ తో మ్యాచ్ లు ఆడటంపై మాట్లాడాడు. ఆ తర్వాత ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరో లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ కూడా సచిన్ అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు. పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఆడకుండా ఉండరాదని చెప్పాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ తో ఆడకపోతే ప్రత్యర్థి జట్టుకి అప్పనంగా రెండు పాయింట్ల లాభం చేకూర్చినట్టవుతుందని తెలిపాడు.

గావస్కర్ మాటలతో ఏకీభవిస్తూ సచిన్ రెండు పాయింట్లు కోల్పోయే బదులు భారత్ జూన్ 16 మ్యాచ్ ఆడాలని సూచించాడు. టీమిండియా రెండు పాయింట్లు కోల్పోతే తాను చాలా నిరాశ చెందుతానన్నాడు. ప్రపంచ కప్ లో భారత్ ఎప్పుడూ పాక్ ను చిత్తు చేసిందని, మరోసారి మట్టి కరిపించాల్సిన సమయం ఇదని తెలిపాడు. వ్యక్తిగతంగా పాకిస్థాన్ కి రెండు పాయింట్లు ఇవ్వడాన్ని తాను అంగీకరించనని, ఇది టోర్నమెంట్లో ఆ జట్టుకు మేలు చేస్తుందన్నాడు.

మిగతా అన్నిటి కంటే ముందు భారత్ కే తన తొలి ప్రాధాన్యత అని సచిన్ ప్రకటించాడు. ఈ వ్యవహారంలో దేశం ఏ నిర్ణయం తీసుకున్నా తాను సమర్థిస్తానని చెప్పాడు. హర్భజన్ తో పాటు యుజువేంద్ర చహల్ కూడా పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని కోరాడు. అయితే గావస్కర్ మాత్రం ‘భారత్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడకపోతే ఎవరు నెగ్గినట్టు? నేను సెమీఫైనల్, ఫైనల్ గురించి మాట్లాడటం లేదు. పాకిస్థాన్ గెలిచినట్టవుతుంది. ఆ జట్టు రెండు పాయింట్లు సాధించగలుగుతుందని’ చెప్పాడు.

పాకిస్థాన్ తో ఆడొద్దని భారత ప్రభుత్వం బీసీసీఐకి సూచించడంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందనే ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు ఐసీసీ ఈ వ్యవహారంపై నోరు విప్పలేదు. క్రికెట్ సర్వోన్నత సంస్థ ఏమంటుందోనని అంతా వేచి చూస్తున్నారు.