వసూళ్ల దందా కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి మరో మంత్రి..!

వసూళ్ల దందా కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి మరో మంత్రి..!

వసూళ్ల దందా వ్యవహారం.. ఉద్ధవ్‌ సర్కార్‌ను వెంటాడుతోంది. కేబినెట్‌లో మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలతో.. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయగా.. మరో మంత్రి అనిల్‌ పరబ్‌కూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే సంచలన విషయాలు బయటపెట్టారు. ఎన్‌ఐఏకు లేఖ రాసిన సచిన్‌ వాజే.. అందులో కీలక విషయాలు వెల్లడించారు. వసూళ్ల దందాలో మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు.. మరో మంత్రి అనిల్‌ పరబ్‌ హస్తం కూడా ఉందన్న సచిన్‌ వాజే.. ఇద్దరూ కలిసే బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో, ఉద్ధవ్‌ కేబినెట్‌లో మరో వికెట్‌ పడేందుకు సిద్ధంగా ఉందనే ప్రచారం.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది. 

అసలింతకూ.. ఈ వసూళ్ల దందా ఎలా మొదలైందనే విషయాన్ని లేఖలో సవివరంగా తెలిపారు సచిన్‌ వాజే. ఉద్యోగం కోల్పోయిన తనను.. తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఒప్పుకోలేదనీ.. అయితే, ఆయణ్ని ఒప్పించేందుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ రెండు కోట్లు డిమాండ్‌ చేశారన్నారు వాజే. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో.. ఉద్యోగంలో చేరాక విడతల వారీగా ఇవ్వమని అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు చెప్పారు సచిన్‌ వాజే. ఆయనను.. అధికారిక నివాసంలోనే కలిసినట్టు లేఖలో స్పష్టం చేశారు వాజే.  1650 బార్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసి సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌కు తీసుకురావాలని దేశ్‌ముఖ్‌ చెప్పగా.. తన పరిధిలో అది సాధ్యం కాదని చెప్పినట్టు లేఖలో తెలియజేశారు సచిన్‌ వాజే. ఒక్కో పోలీసు అధికారి నుంచి మూడు నుంచి మూడున్నర లక్షలు వసూలు చేయాలని ఆదేశించారని చెప్పారు. వసూళ్ల పర్వంలో రవాణ మంత్రి అనిల్‌ పరబ్‌ కు భాగం ఉందని.. తన లేఖలో తెలిపారు సచిన్‌ వాజే. ఆయన 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. వివాదంలో ఉన్న ఓ ట్రస్ట్ కు సంబంధించి.. కేసు క్లోజ్‌ చేస్తానని చెప్పి యాజమాన్యం నుంచి 50 కోట్లు వసూలు చేయాలని పరబ్‌ సలహా ఇచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు సచిన్‌ వాజే. బీఎంసీకి చెందిన  ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయమన్నట్టు కూడా ఆరోపించారు సచిన్‌ వాజే. అయితే, సచిన్‌ వాజే చెప్పిందంతా అబద్ధమన్నారు అనిల్‌ పరబ్‌. నార్కో టెస్టుకైనా సిద్ధమన్నారు.