ఎన్‌ఐఏ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన సచిన్ వాజే

ఎన్‌ఐఏ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన సచిన్ వాజే

ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాల వాహనం లభించిన కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోగా.. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు దారితీసింది. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సచిన్ వాజే సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజే.. కీలక విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. తనను రూ.2 కోట్లు డిమాండ్ చేశారని.. బార్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయమని ఆయన చెప్పినట్టుగా ఆరోపించాడు. డబ్బులు వసూలు చేయడమే నీ ఉద్యోగం అంటూ అనిల్ దేశ్‌ముఖ్ అన్నట్టుగా ఎన్‌ఐఏ విచారణలో సచిన్ వాజే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కేసు.. తాజాగా సచిన్ వాజే చేసిన వ్యాఖ్యలతో మరింత కాకరేపుతోంది..

ఇక, ఈ కేసులో ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. రూ.200 కోట్లు వసూలు చేయాలంటూ తనకు హోంమంత్రి టార్గెట్ పెట్టినట్టు ఆరోపించారు. ఇక, దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు.. అనిల్ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.. దీంతో.. తన పదవికి రాజీనామా చేశారు అనిల్.. బాంబే హైకోర్టు వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా.. ఈ కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటూ కలకలం సృష్టిస్తోంది. మరోవైపు.. సచిన్ వాజే.. ఎన్‌ఐఏ కస్టడీని ఏప్రిల్ 9 వరకు పొడిగించింది కోర్టు.. వాజ్ ను మార్చి 13 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.