తిరుమలలో వైభవంగా సహస్ర కలశాభిషేకం

తిరుమలలో వైభవంగా సహస్ర కలశాభిషేకం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి పంచబేరాల్లో ఒక్కటైన భోగశ్రీనివాసమూర్తిని పల్లవరాణి శ్రీవారి ఆలయానికి బహూకరించిన రోజును పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6-8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్‌ను, ఆయనకు అభిముఖంగా శ్రీ విశ్వక్సేనులవారిని ఉంచారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. దీనివల్ల శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. మధ్య శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, భోగశ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు.. శ్రీవారి మూలమూర్తికి భోగశ్రీనివాసుడికి దారంతో అనుసంధానం చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య అర్చకస్వాములు అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చక స్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు.