రివ్యూ : శైలజా రెడ్డి అల్లుడు 

రివ్యూ : శైలజా రెడ్డి అల్లుడు 

నటీనటులు : నాగచైతన్య, అను ఇమ్మానుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, నరేష్, రఘుబాబు, మురళీశర్మ, పృద్విరాజ్ తదితరులు 

మ్యూజిక్ : గోపిసుందర్ 

ఫోటోగ్రఫి : నిజార్ షఫీ 

నిర్మాతలు : నాగవంశీ, పిడిపి ప్రసాద్ 

దర్శకత్వం : మారుతి 

రిలీజ్ డేట్ : 13-09-2018

 

భలేభలే మగాడివోయ్, మహానుభావుడు తరువాత మారుతి చేస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  అత్తా అల్లుడి మధ్య జరిగే కథ ఇది.   ఇలాంటి కథలతో కూడిన సినిమాలు 1990 వ దశకంలో చాలా వచ్చాయి.  ఆద్యతం హృద్యంగా, ఆహ్లాదకరంగా, హాస్యచతురతతో కూడుకొని ఉండేవి.  అలాంటి జానర్ లో వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

నాగచైతన్య ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించే మనస్తత్వం కలిగిన వ్యక్తి.  ఏ విషయాన్నైనా పాజిటివ్ గా తీసుకుంటాడు.  చైతు తండ్రి మురళీ శర్మకు అహం ఎక్కువ.  తాను చెప్పిందే జరగాలి అనే తత్త్వం కలిగిన వ్యక్తి.  మురళీ శర్మ లాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి అను ఇమ్మానుయేల్ చైతు జీవితంలోకి వస్తుంది.  ఇంట్లో తండ్రి అహాన్ని భరించడమే కష్టంగా ఉందని అనుకునే చైతుకి అను లాంటి అహం ఉన్న అమ్మాయిని భరించడం ఇంకెలా ఉంటుంది.  ఇగో ఎక్కువగా ఉన్న అనును ఎలాగో పాట్లు పడి దారికి తెచ్చుకుంటాడు.  వీరి పెళ్లి సమయంలో చైతుకి మరో విషయం తెలుస్తుంది.  తనకు కాబోయే అత్తగారు రమ్యకృష్ణకు అను కంటే అహంభావం ఎక్కువగా ఉందని తెలియడంతో.. షాక్ అవుతాడు.  ఇటు ప్రేమించిన అను.. అటు అత్త.. ఇద్దరి మధ్య అల్లుడు ఎలా నలిగిపోయాడు.. ? వాళ్ళ అహాన్ని ఎలా తగ్గించాడు..? చివరికి ఏం జరిగింది అన్నది చిత్రకథ.  

విశ్లేషణ : 

అత్తా అల్లుడు.. అహం అనే కథలతో కూడిన సినిమాల్లో మనకు ఎక్కువగా వినోదం కనిపిస్తుంది.  కథ అలాగే ఉన్నప్పటికి కథనాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి.  తండ్రి, అత్తా, భార్య.. ఇలా ముగ్గురు అహంతో కూడుకున్న వ్యక్తులే.  ముగ్గురి ప్రేమను పొందాలనే తాపత్రపడే యువకుడి పాత్రలో చైతన్య కనిపిస్తాడు.  ప్రేమకోసం ముగ్గురు వ్యక్తుల్ని వారి అహాన్ని సంతృప్తి పరుస్తూ.. కథను నడిపించాడు దర్శకుడు.  ఒకవైపు హాస్యం పండిస్తూనే.. మరోవైపు పాత్రల మధ్య డ్రామా నడుస్తుంది.  హాస్య ప్రధానమైన ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు ఎక్కువగా హాస్యాన్ని దృష్టిలో పెట్టుకొని థియేటర్స్ కు వస్తారు.  ఇందులో ఆశించినంత హాస్యం కనిపించలేదు.  కథ నడిపిన తీరు బాగుంది.  అహం ఉన్న అమ్మాయిని ప్రేమలో దించే ప్రయత్నంలో కామెడీ బాగా కుదిరింది.  ఫస్ట్ హాఫ్ ప్రేమ చుట్టూ తిరుగుతుంది.  సెకండ్ హాఫ్ లో అత్తగారు శైలజా రెడ్డి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది.  రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది.  రమ్యకృష్ణ ఎంటర్ అయ్యాక సినిమాలో జోష్ పెరిగింది.  క్లైమాక్స్ సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నాయి తప్పించి కొత్తదనం అన్నది ఏమి కనిపించలేదు.  

నటీనటుల పనితీరు : 

నాగచైతన్య పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా కనిపించాడు.  యాక్టివ్ గా ఉంటూ.. నటనాపరంగా చాలా పరిణితిని పొందాడు.  అను మరోసారి తన అందంతో, నటనతోను ఆకట్టుకుంది. రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  అత్త పాత్రలో శైలజా రెడ్డి నటన భేష్.  వెన్నెల కిషోర్, పృద్విల కామిడి టైమింగ్ బాగుంది. 

సాంకేతిక వర్గం పనితీరు : 

భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో పోల్చుకుంటే.. శైలజా రెడ్డి అల్లుడు విషయంలో ఆ స్థాయిలో దర్శకత్వం కనిపించలేదు.  కథలో డ్రామాను ఎక్కువ జొప్పించడంతో.. హాస్యం పక్కదారి పట్టింది.  ఆసక్తికరమైన మలుపులు లేకపోవడంతో చివరివరకు సినిమా సాదాసీదాగా సాగిపోయింది.  నిజార్ షఫీ ఫోటోగ్రఫి ఆకట్టుకునే విధంగా ఉన్నది.  ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ కనిపించింది.  గోపి సుందర్ సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి.  కామెడీ ఇంకాస్త బాగుందే సినిమా మరోరకంగా ఉండేది.  

పాజిటివ్ పాయింట్స్ : 

నటీనటులు 

అహం తో కూడిన కథ 

సెకండ్ హాఫ్ కామెడీ 

నెగెటివ్ పాయింట్స్ : 

అనుకున్నంత హాస్యం లేకపోవడం 

చివరిగా : డ్రామా పండింది.. హాస్యం కరువైంది.