'బాబు ఘోరంగా ఓడిపోతున్నారు.. క్యాడర్‌ కోసమే డ్రామా..!'

'బాబు ఘోరంగా ఓడిపోతున్నారు.. క్యాడర్‌ కోసమే డ్రామా..!'

సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతున్నారు.. పార్టీ మిగలదనీ.. తన క్యాడర్ ని‌ నిలబెట్టుకునేందుకే ఇలా ప్రణాళిక ప్రకారం డ్రామా చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలింగ్‌కు ముందు రోజు నుండే చంద్రబాబు హై డ్రామా ప్రారంభించారని సెటైర్లు వేశారు. ఇక అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిలపై రాజుపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 10వ తేదీ నుండే ఈసీ దగ్గర డ్రామాకు తెరలేపారని... మరోవైపు సింపతీ కోసం కోడెల శివప్రసాద్‌ కూడా డ్రామా బాగా చేశారని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్ హుందాగా వుండాల్సిన వ్యక్తి కూడా ఇలా చేయడం సిగ్గుమాలిన పని అని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

2014లో మేం ఓడిపోయినపప్పుడు ప్రజా తీర్పును గౌరవించాం... ఈ ఎన్నికలల్లో విజయం‌కోసం కష్టపడ్డామన్న సజ్జల.. కానీ, చంద్రబాబు ఇంకా తీర్పు రాకముందే ఓటమికి ఈవీఎంలు కారణమవుతున్నాయని ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. కంప్యూటర్ కనుగొన్నాన్నా చంద్రబాబు.. ఈవీఎంలను తప్పుపడుతున్నారంటే ఓటమి‌భయం పట్టుకుందేమో అనిపిస్తోందని సెటైర్లు వేశారు. 30 వేల ఈవీఎంలు పని చేయలేదని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తొత్తులుగా పనిచేసే అధికారం లేకపోయింది.. కనుక ఇప్పుడు ఓటమికి కారణాలు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు నారాయణ, చైతన్య కాలేజీల ఉద్యోగులను వాడారని ఆరోపించిన సజ్జల.. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టి రిజర్వ్ లో ఉంచారని విమర్శించారు. రిటర్నింగ్ అధికారులు కూడా చంద్ర బాబు నియమించుకున్న వాళ్లే.. ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనుపడుతున్న తర్వాత చంద్రబాబులో అసహనం పెరిగిందన్నారు.