'చంద్రబాబు ఏమైనా థండర్ బోల్టా..!?'

'చంద్రబాబు ఏమైనా థండర్ బోల్టా..!?'

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం.. అందులో పేర్కొన్న అంశాలపై సెటైర్లు వేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... తాను సరైన సమయం‌లో రివ్యూ చేసి నివారణ చర్యల చేపట్టి ఉంటే పిడుగుపడి ఏడు మంది చనిపోయోవారు ‌కాదని ఈసీకి రాసిన లేఖలో పేర్కొనడం అర్థం కాలేదని.. అవెంజెర్స్ సినిమాలో థండర్ బోల్ట్ లాగా ఈయన ఏమైనా పిడుగులు రాకుండా అపుతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఈయన థండర్ బోల్ట్ కాదు... చంద్ర బోల్ట్.. రాష్ట్రంలో ఐదేళ్లుగా పిడుగులు కురిపిస్తున్నాడంటూ చంద్రబాబు పాలనపై మండిపడ్డారు సజ్జల. ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుండి రోజుకో విన్యాసం చేస్తున్నారని ఎద్దేవా చేసిన వైసీపీ నేత... ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నెలరోజుల పాటు తాను సమీక్షలు చేయకపోతే ఖర్చులు అదనంగా పెరిగిపోతే ఈసీ బాధ్యత వహించాలని చంద్రబాబు లేఖలో రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు పాలన అయిపోయింది.. ఈసీ కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు చేయడం కోసం ఆరాటపడడం ఎందుకు అన్నారు. 

పోలవరం బిల్లులపై సమీక్షలు చేయడం వెనుక కారణం ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసుకుని ఆయనకు రావాల్సిన కమీషన్ల కోసం మాత్రమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి... తాగునీటి కోసం సమీక్ష అని చెప్పి పోలవరం బిల్లులపై రివ్యూ చేశారని ఆరోపించిన ఆయన... ఈ నెల రోజుల్లో సీఆర్‌డీఏపై రివ్యూ చేసి ఎన్ని బిల్డింగ్ లు కడతారు? అంటూ సెటైర్లు వేశారు. శాంతి భద్రత పేరుతో రివ్యూ చేసి యరపతినేనిపై వున్న కేసులను క్లోజ్ చేయడానికి సమీక్షలు చేశారని ఆరోపించిన సజ్జల... ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈనెల రోజుల్లో ఏం చేస్తారు అని ప్రశ్నించారు.