రివ్యూ : సాక్ష్యం

రివ్యూ : సాక్ష్యం

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్ తదితరులు. 

మ్యూజిక్ : హర్షవర్ధన్ 

ఫోటోగ్రఫి : ఆర్ధర్ ఏ విల్సన్ 

నిర్మాత : అభిషేక్ నామా 

దర్శకత్వం : శ్రీవాస్ 

రిలీజ్ డేట్ : 27-07-2018 

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు.  ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక సినిమాలతో తన ఇమేజ్ ను పెంచుకోవడమే కాకుండా.. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మినీ బాహుబలిగా వర్ణించదగ్గ సినిమా అంటూ ప్రచారం చేసిన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

రాజ వంశానికి చెందిన శరత్ కుమార్ కుటుంబం తమకు అడ్డు వస్తుందని చెప్పి జగపతిబాబు సోదరులు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు.  ఆ కుటుంబాన్ని నాశనం చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించకూడదని, సాక్ష్యం ఎవరూ ఉండకూడదని పిల్లలను, పశువులను అందరిని చంపేస్తారు. ఈ కుటుంబంలో లేకలేక పుట్టిన పిల్లవాడు బెల్లంకొండ శ్రీనివాస్.  జగపతి బాబు సోదరులు సృష్టించిన మారణకాండ నుంచి ఏదోలా తప్పించుకుంటాడు.  అక్కడి నుంచి విదేశాలకు వెళ్లి అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు.  అక్కడి నుంచి కొన్ని కారణాల వలన ఇండియాకు వచ్చి, తన కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

హీరో కుటుంబాన్ని నాశనం చేయడం, హీరో పెద్దవాడయ్యాక తన కుటుంబాన్ని నాశనం చేసిన దుర్మార్గులపై పగ తీర్చుకోవడం వంటి కథలతో కూడిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి.  బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇలాంటి పాయింట్ తో వచ్చిన సినిమాలు కోకొల్లలు.  ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ వంటి హీరోలు ఆ కాలంలోనే ఈ పాయింట్ తో అనేక సినిమాలు చేశారు.  పాయింట్ సింపుల్ గా ఉన్నా దాని చుట్టు అల్లుకునే కథనాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం.  కథనాలు కొత్తగా ఉండి, ప్రేక్షకులను కన్విన్స్ చేయగలిగేవిగా ఉంటె సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.  ఈ కథలో పగ ప్రతీకారాలకు దర్శకుడు పంచభూతాలనే నేపథ్యాన్ని జోడించి ఆసక్తిని కలిగేలా చేశాడు.  పగ తీర్చుకోవడంలో పంచభూతాలు ఎలా సహాయపడ్డాయన్నది ఇక్కడ ఆసక్తికరం.  సినిమా ఓపెనింగ్ నుంచి మొదటి పది పదిహేను నిముషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  ఉత్కంఠతను రేకెత్తించాడు.  ఎప్పుడైతే అక్కడి నుంచి కథ విదేశాలకు వెళ్తుందో అక్కడ ఆ బిగుతు సడలి రొటీన్ గా విసుగు తెప్పించింది.  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డేల మధ్య ప్రేమ కథ పెద్దగా వర్కౌట్ కాలేదు.  హీరో ఇండియాకు తిరిగి వచ్చిన తరువాతే కథ స్పీడ్ అందుకుంటుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఆసక్తికరంగా మలచడంతో ఫస్ట్ హాఫ్ కు మంచి మార్కులు పడ్డాయి.  

మాస్ ప్రేక్షకుల కోసమే సెకండ్ హాఫ్ తీసినట్టుగా ఉంటుంది.  శత్రువులను చంపే విధానం ఆధ్యంతం ఆకట్టుకుంది.  సినిమా అంతటికి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్పొచ్చు.  యాక్షన్ ఎపిసోడ్స్ లో పంచభూతాలను మేళవించడం కొత్తగా అనిపించింది.  హీరోకు తన గతం గురించి తెలియకపోయినా.. శత్రువులను ఒక్కొక్కరిగా చంపుతుంటాడు.  పంచభూతాలను ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ చేస్తూ కథను తెలివిగా నడిపించిన విధానం బాగుంది.  కథ ఆసక్తికరంగా సాగే సమయంలో సడెన్ గా పాటలు రావడం కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది.  క్లైమాక్స్ మాత్రం పూర్తిగా మాస్ ప్రేక్షకులు మెచ్చేలా తీసి శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు.  

నటీనటుల పనితీరు : 

బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకావాలనే కోరిక ఈ సినిమాలో మనకు బలంగా కనిపిస్తుంది.  మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కోసమే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. నటన పరంగా బెల్లంకొండ కొంత పరిణితి చెందాడు.  ఎమోషన్ డైలాగ్స్ విషయంలో కాస్త తడబడ్డాడు.  పూజా హెగ్డే మరీ బక్కపలచగా కనిపించింది.  గ్లామర్ కోసం మరీ అంత బక్కపలచగా మారడం అవసరమా అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే.  నలుగురు విలన్లు ఉన్నప్పటికీ, ఫోకస్ అంతా జగపతిబాబుపైనే పెట్టాడు దర్శకుడు.  విలన్ పాత్రలో జగపతిబాబు తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.  వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, రఘుబాబు, రావు రమేష్ తదితరులు ఇలా ఎంతో మంది సినిమాలో ఉన్నప్పటికీ.. సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్, పంచభూతాల చుట్టే తిరుగుతుంది.  మిగతావారి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లినట్టుగా ఉంటాయి.  

సాంకేతికం : 

సింపుల్ పాయింట్ ను పంచభూతాలకు అనుసంధానం చేస్తూ కథను తయారు చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.  కాగితంపై ఎలా రాసుకున్నారో అలా తెరపై ప్రజెంట్ చేయడం చాలా కష్టం.  ఈ విషయంలో దర్శకుడు శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు.  ఈ సినిమాకు దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.  దాని తాలూకు భారీతనం తెరపై మనకు స్పష్టంగా కనిపిస్తుంది.  హర్షవర్ధన్ పాటల్లో చూపించిన వైవిధ్యం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూపించలేకపోయాడు.  ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం.  దీనిపై కాస్త దృష్టి పెట్టి ఉంటె బాగుండేది.  ఫొటోగ్రఫీ బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ

కథనాలు 

పంచభూతాల కాన్సెప్ట్ 

హీరో 

యాక్షన్ 

మేకింగ్ 

మైనస్ పాయింట్స్ : 

లవ్ సీన్స్ 

చివరిగా :  పగ, ప్రతీకారాలకు పంచభూతాలు సాక్ష్యం..