రేస్ 3 గురించి సల్మాన్ ఏం చెప్పాడంటే..!!

రేస్ 3 గురించి సల్మాన్ ఏం చెప్పాడంటే..!!
సల్మాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ వంటి భారీ తారాగణంతో రూపొందిన రేస్ 3 సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.  రెమో దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా చూసినట్టుగానే ఉంటుంది.  ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ దుబాయ్, అబుదాబిలలో జరిగింది.  అబుదాబిలో రేస్ కు సంబంధించిన మెయిన్ ఎపిసోడ్ కోసం 16 కార్లను కొనుగోలు చేసినట్టుగా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.  షూటింగ్ పూర్తయ్యాక ఆ కార్లను తిరిగి అమ్మేద్దామని అనుకున్నా.. షూటింగ్ సమయంలో ఆ కార్లు మొత్తం తునాతునకలు అయినట్టుగా చెప్పుకొచ్చారు.  
 
రేస్ ఫ్రాంచైసీలో నటించేందుకు మొదట సల్మాన్ ఆసక్తి చూపలేదట.  తన శరీరం ఆ కథకు అనుకూలంగా ఉండదనే ఉద్దేశ్యంతో తిరస్కరించారట.  రేస్ మొదటి రెండు భాగాలకు నిర్మాతగా వ్యవహరించిన రమేష్ తరణి పట్టుబట్టి రేస్ 3 కు సంబంధించిన స్క్రిప్ట్ ను సల్మాన్ కు వినిపించాడట.  మొదట్లో సినిమాకు తగ్గట్టుగా శరీరం ఫిట్ గా ఉండదేమో అనుకున్నా.. స్క్రిప్ట్ లో మార్పులు చేయడం వలన సినిమాలో నటించేందుకు సల్మాన్ ఒప్పుకోవడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించేందుకు కూడా అంగీకారం తెలిపాడట. 
 
రేస్ 3 నిర్మాణంలో ఉండగానే మరో సినిమాను నిర్మించేందుకు సల్మాన్ సిద్దమయ్యాడు.  రేస్ 3 టీమ్ తోనే ఆ సినిమా ఉంటుందట.  ప్రస్తుతం రేస్ 3 నిర్మాణం పైనే పూర్తి దృష్టి ఉండటంతో.. ఈ సినిమా పూర్తయ్యాకే సల్మాన్ నిర్మించే మరో సినిమా తెరపైకి వెళ్తుందట.  
 
రేస్ 3 లాంటి జానర్ లో ఇప్పటి వరకు సల్మాన్ సినిమా చేయలేదు.  ఇది పూర్తిగా వైవిధ్యభరితమైన సినిమా.  ఈ సినిమాలో మరోమారు సల్మాన్ ఖాన్ తన మజిల్ బాడీని చూపించబోతున్నాడు.  పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ సినిమా రంజాన్ పర్వదినం రోజైన జూన్ 15 న విడుదల కాబోతున్నది.