రివ్యూ: యూటర్న్

 రివ్యూ: యూటర్న్

నటీనటులు : సమంత, ఆది పినిశెట్టి, భూమిక  

మ్యూజిక్ : నికేత్ బొమ్మిరెడ్డి

ఫోటోగ్రఫి : నికేత్ బొమ్మిరెడ్డి

నిర్మాతలు : రాంబాబు బండారి, శ్రీనివాస్ చిట్టూరి  

దర్శకత్వం : పవన్ కుమార్ 

రిలీజ్ డేట్ : 13-09-2018

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత నటించిన థ్రిల్లర్ 'యూటర్న్' ఈరోజే విడుదలైంది.  మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.. 
 
కథ: 
రిపోర్టర్ రచన (సమంత) ఆర్కే పురం ఫ్లైఓవర్ పై జరిగే యాక్సిడెంట్ల రహస్యాన్ని ఛేదించాలని పరిశోధన చేస్తుంటుంది.  ఆ ఫ్లైఓవర్ పై షాట్ కట్ రూట్ కోసం  యూటర్న్ తీసుకున్న వ్యక్తులే ఎందుకు చనిపోతున్నారు అనే విషయంపై ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది.  
 
ఆ సమయంలోనే ఆమె ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది.  ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నాయక్ (ఆది)కి రచన ఏలాంటి తప్పు చేయలేదని తెలిసి ఆమె సహాయంతో ఆ చావుల గురించి ఎంక్వైరీ మొదలుపెడతాడు.  అసలు ఆ ఫ్లైఓవర్ పై  యూటర్న్  తీసుకునేం వారే ఎందుకు చనిపోతున్నారు ? అవి ప్రమాదాలా లేకపోతే హత్యలా ? వాటివెనకున్న రహస్యం ఏమిటి ? అనేదే ఈ సినిమా కథ. 
 
విశ్లేషణ : 
ఒక ఫ్లైఓవర్ పై జరిగే చావుల నేపథ్యంలో కథను రాసుకుని దాని ద్వారా సామాజిక సందేశం  ఇద్దామనుకున్న దర్శకుడు పవన్ కుమార్ ప్రయత్నం బాగుంది.  ఫ్లైఓవర్ పై  యూటర్న్ తీసుకున్నవారు చనిపోవడం వెనకున్న అసలు రహస్యాన్ని దాచిపెట్టి మొదటి అర్ధ భాగంలో దర్శకుడు మైంటైన్ చేసిన సస్పెన్స్ బాగుంది.  అంతేగాక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆసక్తికరంగా సాగగా చేయని తప్పుకి చిక్కుల్లో పడిన సందర్భంలో సమంత పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.  అలాగే ఆమెకు, ఆమె తల్లికి మధ్యన నడిచే కామెడీ ట్రాక్ కూడ బాగుంది.  ఫస్టాఫ్ వరకు సినిమాను బాగానే నడిపిన దర్శకుడు ద్వితీయార్థంలో సరైన కథనం లేకపోవడం, సినిమా మొత్తం సింగిల్ పాయింట్ మీద నడిచేదిగా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.  కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్టు, ఇంకొన్ని వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. 
 
నటీనటుల పనితీరు : 
మిస్టరీని ఛేదించాలనే ఉత్సాహంలో పని మొదలుపెట్టిన సమంత అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ను ఎదుర్కోవాల్సి రావడం ఆయా పరిస్థితుల్లో ఆమె పండించిన   భావోద్వేగాలు బాగా కనెక్టయ్యాయి.  ఆది పినిశెట్టి పోలీస్ పాత్రలో మెప్పించగా రాహుల్ రవీంద్రన్ కూడ తన వంతు కృషి చేశాడు.
 
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు పవన్ ఫస్టాఫ్ వరకు సరిపోయే కథనాన్ని బాగానే రాసుకున్నారు కానీ ద్వితీయార్థంలో  మాత్రం అంతగా ఆకట్టుకునే పనితీరును ప్రదర్శించలేకపోయారు.  అక్కడ కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు లోపించాయి.  నికేత్ బొమ్మిరెడ్డి సిబినిమాటోగ్రఫీ బాగుంది.  నికేత్ బొమ్మిరెడ్డి అందించిన నైపథ్య సంగీతం ఆకట్టుకుంది.  ఎడిటింగ్ విభాగం పనితీరు పర్వాలేదు.  రాంబాబు బండారి, శ్రీనివాస్ చిట్టూరిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.  
 
పాజిటివ్ పాయింట్స్ :
థ్రిల్ కలిగించే కథాంశం 
సమంత పెర్ఫార్మెన్స్ 
ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు 
 
నెగెటివ్ పాయింట్స్ : 
ద్వితీయార్థంలో కథనం లోపించడం 
సాగదీయబడిన సన్నివేశాలు 
 
చివరిగా : సస్పెన్స్ ఉంది కానీ స్క్రీన్ ప్లే లోపించింది