శాంసంగ్ గెలాక్సీ ఏ9. గెలాక్సీ జె6 ప్రైమ్ ఫీచర్లు లీక్?

శాంసంగ్ గెలాక్సీ ఏ9. గెలాక్సీ జె6 ప్రైమ్ ఫీచర్లు లీక్?

ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవలే తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 9ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇక కంపెనీ మరో నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లను యూరప్, ఆసియా, మధ్య తూర్పు మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. గెలాక్సీక్లబ్ కథనం ప్రకారం శాంసంగ్ తన గెలాక్సీ ఏ9, గెలాక్సీ జె6 ప్రైమ్, గెలాక్సీ జె4 కోర్, గెలాక్సీ జె4 ప్రైమ్ ఫోన్లను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఎస్ఎం-ఏ920ఎఫ్ గా పిలుస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ9 స్మార్ట్ ఫోన్ కొత్త వర్షన్ వివరాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. దీనిని గెలాక్సీ ఏ9(2018) లేదా గెలాక్సీ ఏ9(2019) అని విడుదల చేసే ఏడాదిని బట్టి పిలవనున్నారు. కొన్ని మార్కెట్లలో కంపెనీ ఇటీవలే ట్రేడ్ మార్క్ నమోదు చేయించిన ఏ90 మారుపేరును కూడా వాడవచ్చు. 

మోడల్ నెంబర్ ఎస్ఎం-జె610ఎఫ్ గా పిలుస్తున్న డివైస్ గెలాక్సీ జె6 ప్రైమ్ కావచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు గీక్ బెంచ్ వెబ్ సైట్లో దర్శనమిచ్చాయి. దీనికి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇందులో 3జీబీ ర్యామ్ ఉండనుంది. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. మోడల్ నెంబర్ ఎస్ఎం-జె610ఎఫ్ఎన్ ను యూరప్ మార్కెట్ కోసం తయారు చేస్తున్నట్టు సమాచారం.

గెలాక్సీ జె4 సిరీస్ లో మరో రెండు వేరియంట్లను కూడా త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. మోడల్ నెంబర్స్ ఎస్ఎం-జె410ఎఫ్, ఎస్ఎం-జె415ఎఫ్ అంటే గెలాక్సీ జె4 కోర్, జె4 ప్రైమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ రిపోర్ట్ లోని సమాచారం మేరకు గెలాక్సీ జె4 కోర్ ని ప్రత్యేకంగా భారత్, మధ్య తూర్పు మార్కెట్ల కోసం తయారు చేస్తున్నారు. గీక్ బెంచ్ లో కనిపించిన శాంసంగ్ గెలాక్సీ జె4 ప్రైమ్ ని పరిశీలిస్తే ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ అమర్చారు. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. దీనిలో 2జీబీ ర్యామ్ ఉండనుంది.