శ్రీకాకుళంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

శ్రీకాకుళంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ ఉద్యోగులను వెంబండించి మరీ తలలు పగులగొట్టారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైర వద్ద ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకునేందుకు వెళ్లిన గ్రామ రెవెన్యూ అధికారులపై మంగళవారం అర్థరాత్రి ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు గాయాలపాలవ్వగా.. మరో ఇద్దరు వీఆర్వోలు అక్కడ నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఇసుక మాఫియా దాడులపై జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సీరియస్‌ అయ్యారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసినవారిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి, పగలు రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ ప్రశంసించారు. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్‌ ఆదేశించారు. ఇసుక మాఫియా దాడిలో గాయపడి, రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్‌ నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ చక్రధర్ బాబు పరామర్శించారు.