రాకీభాయ్‌ క్రేజ్ తో.. టాలీవుడ్‌కి మరికొందరు ?

రాకీభాయ్‌ క్రేజ్ తో.. టాలీవుడ్‌కి మరికొందరు ?

తెలుగు హీరోలు ఎప్పటినుంచో కన్నడ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. అక్కడ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు హీరోలకు పోటీగా కన్నడ స్టార్లు కూడా టాలీవుడ్‌కి వస్తున్నారు. యశ్‌ ఇచ్చిన ధైర్యంతో తెలుగు మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. మరి శాండల్‌వుడ్‌ స్టార్లంతా రాకీ భాయ్‌లు కాగలరా?

'కె.జి.ఎఫ్.'తో యశ్‌కి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు మార్కెట్‌లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఎఫెక్ట్‌తో కన్నడనాట యశ్‌ రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందట. దీంతో కన్నడ స్టార్లంతా రెమ్యూనరేషన్‌ పెంచుకోవడానికి టాలీవుడ్లో ల్యాండ్‌ అవుతున్నారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులముందుకొస్తున్నారు.

కన్నడ టాప్ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కి కర్నాటకలో తప్ప మిగతా చోట్ల పెద్దగా మార్కెట్‌ లేదు. అందుకే కన్నడలో యశ్‌ కంటే పెద్ద హీరో అయినా రెమ్యూనరేషన్‌ యశ్‌ కంటే వెనకబడ్డాడు పునీత్. ఇక మార్కెట్‌ పెంచుకోకపోతే టాప్‌ ఛైర్‌ కూడా పోతుందేమో అని భయపడుతున్నాడట పునీత్. అందుకే 'యువరత్న' సినిమాతో తెలుగు మార్కెట్‌కి వస్తున్నాడు పునీత్ రాజ్‌కుమార్. 

అర్జున్‌ మేనళ్లుడు ధృవ్ సార్జా కూడా టాలీవుడ్‌కి వస్తున్నాడు. రష్మిక మందన్న సాయంతో 'పొగరు' సినిమాని తెలుగులో డబ్‌ చేస్తున్నాడు. పునీత్, ధృవ్‌ మాత్రమే కాదు, కన్నడలో కొంచెం గుర్తింపు ఉన్న హీరోలంతా మార్కెట్‌ పెంచుకోవడానికి టాలీవుడ్‌కి వస్తున్నారు. అయితే కన్నడ సినిమాల్లో క్వాలిటీ కొంచెం తక్కువ అనే విమర్శలున్నాయి. మరి ఈ కామెంట్స్‌ని ఓవర్‌ కమ్‌ చేసి తెలుగులో ఎలా మార్కెట్ తెచ్చుకుంటారో చూడాలి.