జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

త్వరలోనే టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కగా... మరో ఇద్దరు టీఆర్ఎస్‌లో చేరితే.. విలీన ప్రక్రియకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? టీఆర్ఎస్‌లో చేరుతారు అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఏ ఎమ్మెల్యేనైనా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ ఎజెండా ఎప్పుడూ ప్రజల కోసమే ఉంటుందన్న జగ్గారెడ్డి.. నాకు అన్ని పార్టీలతో  పరిచయాలు ఉన్నాయి... భవిష్యత్తు నిర్ణయం... నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా ఉండాలి అనేదే నా ఆలోచన అన్నారు. 

2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా పిలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసుకున్న జగ్గారెడ్డి... టీఆర్ఎస్‌లో గెలిచినా.. తెలంగాణ ఎప్పుడు వస్తుందో అని అనుకున్నానని.. సంగారెడ్డి అభివృద్ధి జరగాలని అప్పుడు పార్టీ మారానని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని వీడాలని లేదన్న జగ్గారెడ్డి.. పార్టీలోకి రమ్మని టీఆర్ఎస్ నన్ను అడగటం లేదు... నేను ప్రయత్నం చేయడం లేదన్నారు. కుటుంబం కోసమో... డబ్బు కోసమో నా రాజకీయ నిర్ణయం ఉండదు.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసమే నా నిర్ణయం ఉంటుందన్నారు. అయితే, జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారడం ఖాయమా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.