ఫ్రిజ్‌, ఏసీ, వాషింగ్‌ మెషీన్లపై పన్ను తగ్గింపు

ఫ్రిజ్‌, ఏసీ, వాషింగ్‌ మెషీన్లపై పన్ను తగ్గింపు

అనుకున్నట్లే ఇవాళ జీఎస్టీ కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగానే శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును పూర్తిగా మినహాయించారు. వీటిపై ఇపుడు 12 శాతం పన్ను విధిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన 28వ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ మీడియాకు వివరంచారు.  అత్యధిక పన్ను శ్లాబులోని పలు వస్తువులపై పన్ను తగ్గించారు. ఇప్పటి వరకు రూ.500 వరకు ధర ఉన్న వస్తువులకు ఉన్న 5 శాతం పన్ను స్లాబును రూ. 1000 వరకు పెంచారు.  రాళ్లు, మార్బుల్స్‌, రాఖీ, రాతితో తయారు చేసే దేవతా విగ్రహాలపై జీఎస్టీ  పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు  మంత్రి తెలిపారు.   తగ్గించిన ధరలు జులై 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
అలాగే మహిళలు విరివిగా ఉపయోగించే  హ్యాండ్‌బ్యాగ్స్‌, జ్యువెలరీ బాక్స్‌, అద్దాలు, హ్యాండ్‌మేడ్‌ ల్యాంప్స్‌తో పాటు ఇతర వస్తువులను 12శాతం పన్ను శ్లాబు పరిధిలోకి తెచ్చారు. వ్యవసాయం కోసం వాడే యూరియా దిగుమతులపై  జీఎస్టీని 5శాతం తగ్గించారు. ఏసీలు, రిఫ్రిజరేటర్లు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లపై విధిస్తున్న పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు.  ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కొనుగోలు చేసే ఇథనాయిల్‌పై ఇపుడు 18శాతం పన్ను వసూలు చేస్తుండగా... దీన్ని  5శాతానికి తగ్గించారు.  ప్రత్యేక అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాలు, వర్క్‌ ట్రక్స్‌ను 18శాతం పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు.

లిథియం ఐయాన్‌ బ్యాటరీలు, వ్యాక్యుమ్‌ క్లీనర్స్‌, ఫుడ్‌ గ్రైండర్లు, మిక్సీలు, వాటర్‌ హీటర్లు, హెడ్‌ డ్రైయర్లు, హ్యాండ్‌ డ్రైయర్లు, పెయింటింగ్స్‌, వార్నిష్‌, వాటర్‌ కూలర్‌, మిల్క్‌ కూలర్‌, ఐస్‌క్రీం కూలర్‌, పెర్ఫ్యూమ్స్‌, టాయిలెట్‌ స్ప్రేలపై  పన్నును 28శాతం నుంచి  18శాతానికి తగ్గించారు.